Telugu Gateway
Latest News

ఆర్ధిక కష్టాల్లో రామ్ చరణ్ ‘ట్రూజెట్ ఎయిర్ లైన్స్’

ఆర్ధిక కష్టాల్లో రామ్ చరణ్ ‘ట్రూజెట్ ఎయిర్ లైన్స్’
X

వేతనాల్లో 50 నుంచి 60 శాతం వరకూ కోత

హీరో రామ్ చరణ్ డైరక్టర్ గా ఉన్న టర్భో మెగా ఎయిర్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్ తీవ్ర కష్టాల్లో పడింది. కోవిడ్ 19 దెబ్బ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏవియేషన్ రంగం సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఈ సంస్థ ‘ట్రూజెట్ ’ పేరుతో ఎయిర్ లైన్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దేశంలోని అతి పెద్ద ఎయిర్ లైన్స్ అయిన ఇండిగోనే ఆర్ధిక నష్టాలను తగ్గించుకునేందుకు ఏకంగా పది శాతం మంది సిబ్బందికి లేఅఫ్ ప్రకటించింది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ట్రూజెట్ తాజాగా ఉద్యోగులకు ఓ లేఖ పంపింది. అందులో తాము తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని, నిధుల లభ్యత సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. తొలి నుంచి ట్రూజెట్ సర్వీసుల విషయంలోనూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. తర్వాతర్వాత కొద్దిగా సర్వీసులు నిలదొక్కుతున్నా ప్రస్తుతం మాత్రం ఎయిర్ లైన్స్ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది. బకాయిలు చెల్లించలేదనే కారణంతో కొద్ది రోజుల క్రితం ఈ సంస్థకు విమానాలను అద్దెకు ఇచ్చిన వారు కొన్ని విమానాలను కూడా నిలిపివేశారు.

సంస్థ చేతిలో మొత్తం ఏడు ఏటీఆర్ విమానాలు ఉండగా అందులో ఐటింటిని అద్దెకు ఇచ్చిన వారు నిలిపివేశారని ‘బిజినెస్ లైన్’ పత్రిక వెల్లడించింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ వరకూ పూర్తి వేతనాలు అందజేసిన ట్రూజెట్ మే, జూన్ లో కొంత మేర కోత వేసింది. సంస్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇక నుంచి కొంత మంది వేతనాల్లో 50 శాతం మేర, మరికొంత మంది వేతనాల్లో 60 వేత కోత విధించాలని నిర్ణయించినట్లు బిజినెస్ లైన్ తన కథనంలో పేర్కొంది. జులై నెల నుంచి ఇది అమల్లోకి రానుంది. సాదారణ రోజుల్లో సగటున 70 శాతం లోడ్ ఫ్యాక్టర్ తో రోజుకు 60 ఫ్లైట్ సర్వీసులు నడిపిన ఈ కంపెనీ ప్రస్తుతం లోడ్ ఫ్యాక్టర్ 22 నుంచి 23 శాతానికి పరిమితం అయింది. దేశంలోని ప్రైవేట్ ఎయిర్ లైన్స్ అన్నింటిలో కెల్లా ట్రూజెట్ పై అత్యధిక ఫిర్యాదులు ఉన్నాయి. ట్రూజెట్ ఎయిర్ లైన్స్ లో రామ్ చరణ్ తోపాటు మెగా సంస్థ, ఇతరులు భాగస్వాములుగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంస్థ తిరిగి కోలుకోవటం అంత తేలికైన వ్యవహారం కాదని ఈ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెద్ద పెద్ద సంస్థలే బయటపడేందుకు చాలా కష్టాలు పడుతున్నాయని అలాంటిది ట్రూజెట్ లాంటి సంస్థ నిలదొక్కుకోవటం అంతే అంత తేలికైన వ్యవహారం కాదని చెబుతున్నారు. ఏవియేషన్ రంగం కోవిడ్ 19 ముందు పరిస్థిితికి రావటానికి మూడు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుందని ఈ రంగంలోని అగ్రశ్రేణి సంస్థలు అంచనా వేస్తున్నాయి.

Next Story
Share it