సుశాంత్ మరణంపై సుబ్రమణ్యస్వామి కీలక వ్యాఖ్యలు

బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఆత్మహత్య కాదు..హత్యే అని పేర్కొన్నారు. అంతే కాదు ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ముంబయ్ పోలీసుల ఎఫ్‌ఐఆర్‌పై ఆయన పలు సందేహాలు వ్యక్తం చేశారు. తన ఆరోపణలకు మద్దతుగా ఓ డాక్యుమెంట్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేసిన సుబ్రహ్మణ్యస్వామి ఇందులో పేర్కొన్న 26 పాయింట్లలో 24 పాయింట్లు ఇది హత్యేనని పేర్కొంటున్నాయని వ్యాఖ్యానించారు. సుశాంత్ రాజ్‌పుత్ మెడపై ఉన్న గుర్తు ఆత్మహత్యతో సరిపోలడం లేదని, ఇది హత్యను సూచిస్తోందని అన్నారు.
ఈ డాక్యుమెంట్ ప్రకారం సుశాంత్ శరీరంపై కొట్టిన గుర్తులు ఉన్నాయని, ఎలాంటి సూసైడ్ నోట్ లేదని ఇందులో పొందుపరిచారని పేర్కొన్నారు. సుశాంత్ కంటే ముందు బలవన్మరణానికి పాల్పడిన మేనేజర్ దిశా సలియాన్‌కు కొన్ని అంశాలు తెలిసిఉంటాయని పేర్కొన్నారు. ముంబయ్ పోలీసులు సుశాంత్ కేసులో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ను అనుసరించారా అని సుబ్రహ్మణ్య స్వామి సందేహం వ్యక్తం చేశారు. సుశాంత్ మరణంపై ఆయన బుధవారం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో మాట్లాడారు. సుశాంత్ మరణానికి ఆయన మాజీ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి వేధింపులే కారణమని ఆరోపిస్తూ సుశాంత్ తండ్రి పోలీసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో స్వామి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.