Telugu Gateway
Latest News

‘గుండె తడి’ ఉన్న నటుడు సోనూ సూద్

‘గుండె తడి’ ఉన్న నటుడు సోనూ సూద్
X

చెప్పిన గంటల్లోనే మదనపల్లి రైతుకు ట్రాక్టర్ అందజేత

ప్రకటనలు వేరు. అమలు వేరు. మీడియాలో అప్పుడప్పుడు వచ్చే కదిలించే వార్తలను చూసి చాలా మంది స్పందిస్తారు. అప్పటికప్పుడు ఏవో ప్రకటనలు చేస్తారు. తర్వాత అవి అమలు అయ్యాయో లేదో ఎవరికీ తెలియదు. కానీ నటుడు సోనూసూద్ మాత్రం అందుకు బిన్నం. మాట చెపితే వెంటనే అమలు చేస్తారు. లాక్ డౌన్ సమయంలో దేశంలో కన్నీరుపెట్టించిన వలస కార్మికుల సమస్యలపై స్పందించి ఎంతో పెద్ద మనసుతో సాయం చేశారు. పలు చోట్ల చిక్కుకున్న వారిని సొంత ఖర్చుతో వారి వారి గమ్యస్థానాలకు చేర్చారు. ఇఫ్పుడు ఏపీకి చెందిన మదనపల్లి రైతుకు ట్రాక్టర్ అందజేసి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఆ రైతు తన ఇధ్దరు కూతుళ్లనే కాడెద్దులుగా మార్చి సాగు ప్రయత్నాలు చేసిన వార్తలు మీడియాలో వచ్చాయి. ఇది చూసిన సోనూసూద్ ఆ రైతు కుటుంబానికి తొలుత రెండు ఎద్దులు కొనిస్తానని ప్రకటించారు.

ఆ తర్వాత వెంటనే ఎద్దులు కాదు..ట్రాక్టర్ ఇస్తానని చెప్పి..గంటల వ్యవధిలోనే ఇచ్చిన హామీని అమలు చేశారు. ఆదివారం సాయంత్రానికే రైతు కుటుంబానికి ట్రాక్టర్ చేరింది. రైతు కుటుంబం సోనూసూద్ కు ధన్యవాదాలు తెలిపింది. పిల్లలు ఇద్దరు చదువుపై దృష్టి సారించాలని సోనూసూద్ సూచించారు. వలస కార్మికులకు సాయంతోనే ఆయన ‘రియల్ హీరో’గా నిలిచారు. సినిమాల్లో ఆయన పోషించేది విలన్ పాత్రలు అయినా...నిజ జీవితంలో మాత్రం హీరోలుగా చెప్పుకునే వారికన్నా ఎంతో మిన్నగా సేవలు అందిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇప్పుడు చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన రైతు కుటుంబాన్ని ఆదుకుని మరోసారి వార్తల్లో నిలిచారు. సోనూసూద్ కు సోషల్ మీడియా నీరాజనం పడుతోంది.

Next Story
Share it