Telugu Gateway
Latest News

జియో నుంచి ‘మేడిన్ ఇండియా’ 5జీ సొల్యూషన్

జియో నుంచి ‘మేడిన్ ఇండియా’  5జీ సొల్యూషన్
X

గూగుల్ పెట్టుబడి 33737 కోట్లు

ఏజీఎంలో రిలయన్స్ కీలక ప్రకటనలు

రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ పలు కీలక ప్రకటనలు చేశారు. పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో కూడిన 5 జీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఇది వచ్చే ఏడాది నుంచే ప్రారంభం అవుతుందని తెలిపారు. కేంద్రం 5జీ స్పెక్ట్రమ్ కు అనుమతులు మంజూరు చేయటమే ఆలశ్యం 5 జీ ఆధారిత సేవలు అందించేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి సంస్థల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించిన రిలయన్స్ జియో ఫ్లాట్ ఫామ్స్ లోకి తాజాగా ఐటి దిగ్గజ సంస్థ గూగుల్ కూడా వచ్చి చేరింది. ఈ సంస్థ జియో ఫ్లాట్ ఫామ్స్ లో 7.7 శాతం వాటాల కోసం 33737 కోట్ల రూపాయల మేర పెట్టుబడి పెట్టనుంది. ఏజీఎంలో ముఖేష్ అంబానీ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు. జియోలో గూగుల్ పెట్టుబడి అత్యంత కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ముఖేష్ అంబానీ కంపెనీ నుంచి కొత్తగా రానున్న జియో టీవీ ప్లస్, జియో గ్లాస్ తదితర అంశాలను కూడా ఏజీఎం వేదికగా తెలిపారు.

జియో, గూగుల్ సంయుక్తంగా ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. కరోనా కారణంగా రిలయన్స్ 43వ ఏజీఎం వర్చువల్ మోడల్ లో జరిగింది. తాజా పరిణామాలతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ కు సంబంధించిన పలు కార్యక్రమాలను ముఖేష్ అంబానీ వాటాదారులకు వివరించారు. రిలయన్స్ రిటైల్ విభాగం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని వెల్లడించారు. లక్ష మంది చిరు వ్యాపారులతో అనుబంధమే తమ అభివృద్ధి వ్యూహమన్నారు. ఈ కార్యక్రమంలో ఇషా, ఆకాష్ అంబానీలు జియో టీవీ ప్లస్ ను ప్రదర్శించారు. కేవలం 75 గ్రాముల బరువు గల జియో గ్లాస్ ను కూడా ఆవిష్కరించారు. ఈ స్మార్ట్ కళ్ళద్దాల్లో 25 రకాల యాప్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. దీన్ని కేబుల్ కు కూడా కనెక్ట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

Next Story
Share it