Telugu Gateway
Latest News

దళితులపై దాడులు నిత్యకృత్యంగా మారాయి

దళితులపై దాడులు నిత్యకృత్యంగా మారాయి
X

ఏపీలో దళితులపై దాడులు నిత్యకృత్యంగా మారాయని జనసేన విమర్శించింది. ఈ దాడులు జరుగుతున్న తీరు ఆందోళనకరంగా ఉందన్నారు. సీతానగరం పోలీస్ స్టేషన్ లో దళిత యువకుడికి శిరోముండనం చేసిన ఘటన కళ్ల ముందు ఉండగానే చీరాలలో పోలీసులు దళిత యువకుడిని పొట్టనపెట్టుకున్న తీరు ఎంతో కలచివేస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎరిచర్ల కిరణ్ కుమార్ అనే యువకుడు మాస్క్ లేకుండా రోడ్డు మీదకు వచ్చాడనే కారణంతో సబ్ ఇన్ స్పెక్టర్ దారుణంగా కొట్టడంతో అతను మరణించాడని, పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

కిరణ్ కుమార్ మృతికి కారణమైన పోలీసు అధికారిని విఆర్ కు పంపి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం చూస్తోందని, కానీ బాధ్యుడైన అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేత అండతోనే పోలీస్ స్టేషన్ లో శిరోముండనం చేయించారని..అందుకు కారణమైన నాయకుడిని మాత్రం అరెస్ట్ చేయలేదన్నారు. దళితులను ప్రభుత్వం ఓటు బ్యాంకుగా చూస్తోంది తప్ప..వారిపై దాడులను అడ్డుకునేందుకు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదని మనోహర్ విమర్శించారు. ఇది ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శమన్నారు.

Next Story
Share it