Telugu Gateway
Latest News

సచివాలయం జీ బ్లాక్ కింద ‘నిజాం నిధి’..అందుకే రహస్య కూల్చివేతలు

సచివాలయం జీ బ్లాక్ కింద ‘నిజాం నిధి’..అందుకే రహస్య కూల్చివేతలు
X

సెక్రటేరియట్ కూల్చివేత వెనక దిమ్మతిరిగే దోపిడీ

తెలంగాణ సచివాలయం కూల్చివేత వెనక దిమ్మతిరిగే దోపిడీ ఉందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో హైకోర్టు కూడా జోక్యం చేసుకోవాలని కోరారు. అతి పురాతనమైన సచివాలయంలోని ‘జీ’ బ్లాక్ కింద నిజాం కాలం నాటి నిధి ఉందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆయన వివిధ పత్రికల్లో వచ్చిన వార్తాపత్రికల క్లిప్పింగ్ లను కూడా మీడియాకు అందజేశారు. ఎవరైనా సూర్యోదయం అయ్యాక పనులు మొదలుపెడతారని..కానీ తెలంగాణ సర్కారు అర్ధరాత్రి రహస్యంగా కూల్చివేతలు ప్రారంభించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. జీ బ్లాక్ కింద ఉన్న నిజాం నిధి కోసం కాకపోతే పనిచేసే కూలీల దగ్గర నుంచి అందరి దగ్గర సెల్ ఫోన్లు తీసుకోవాల్సిన అసవరం ఏముందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏవో ఫోటోలు తీశారనే కారణంతో ఇద్దరు కానిస్టేబుళ్లను వెంటనే డీజీపీ ఆఫీస్ కు సరెండర్ చేశారని అన్నారు. సచివాలయం చుట్టూ రక్షణ గోడ ఉందని..ఎవరూ లోపలికి వెళ్ళలేరని..అలాంటి మూడు కిలోమీటర్ల మేర రోడ్లను బ్లాక్ చేసి ఇంత రహస్యంగా కూల్చివేత పనులు చేయాల్సిన అవసరరం ఉందని అన్నారు.

ఇది అంతా నిధుల కోసమే అన్నారు. సీఎస్, డీజీపీలు దగ్గర ఉండి కూల్చివేతలు పర్యవేక్షించారని, ఈ క్రమంలో గుళ్లు, మసీదులను కూడా ఏది అడ్డు అన్పిస్తే వాటిని నిర్ధాక్షిణ్యంగా కూల్చివేసుకుంటూపోయారన్నారు. పారదర్శకంగా జరగాల్సిన ఈ పనులను అదేదో రక్షణ శాఖ అణుబాంబుల పరీక్షలు నిర్వహించినంత సీక్రెట్ గా మూడో కంటికి తెలియకుండా చేయాల్సిన అవసరం ఏముందన్నారు. సెక్రటేరియట్ జీ బ్లాక్ కు చాలా చరిత్ర ఉందన్నారు. సైఫాబాద్ ప్యాలెస్ గా పిలిచే దీన్ని నిజాం కాలంలో ఆర్ధిక వ్యవహారాలు, ట్రెజరీ కార్యకలాపాల కోసం దీన్ని కేటాయించారని తెలిపారు. పక్కనే ఉన్న మింట్ కాంపాండ్ కూడా దీనిలో భాగమే అన్నారు. నిజాం సంపదకు కేంద్ర బిందువు జీ బ్లాకే అని తెలిపారు.

2012-2016 సంవత్సరాల కాలంలో సెక్రటేరియట్ సమీపంలోని హోంసైన్స్ కాలేజీ, విద్యారణ్య పాఠశాలల ఆవరణల్లో నిర్మాణాల కోసం తవ్వకాలు జరిగినప్పుడు సోరంగాలు బయటపడ్డాయన్నారు. ఈ సొరంగాలు అన్నీ జీ బ్లాక్ కింద వరకూ ఉన్నాయన్నారు. జీ బ్లాక్ భూగర్భంలో నిజాం నిధి ఖచ్చితంగా ఉందనే సంకేతాలు కనిపించాయన్నారు. ఈ సంపద విలువ వేల కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా వేశారన్నారు. ప్రభుత్వ తీరుపై ఎన్నో అనుమానాలు వస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. చరిత్రను ప్రస్తుత పరిణామాలతో లింక్ చేసి చూస్తే మిలియన్ డాలర్ ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయని తెలిపారు. సచివాలయం కూల్చివేత వెనక భయంకరమైన ఆర్ధిక దోపిడీకి కుట్ర జరిగిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.

Next Story
Share it