Telugu Gateway
Latest News

కరోనాకు ముందు నాటి పరిస్థితులు ఇప్పట్లో కష్టమే!

కరోనాకు ముందు నాటి పరిస్థితులు ఇప్పట్లో కష్టమే!
X

ఈ ఏడాది మార్చికి ముందు మూతికి మాస్క్ లు లేవు. క్వారంటైన్లు లేవు..ఐసోలేషన్లు లేవు. ప్రజలు ఎక్కడికి కావాలంటే అక్కడికి..ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లారు..వచ్చారు. కానీ మార్చి నెలాఖరు నాటికి దేశంలో పరిస్థితులు అన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. లాక్ డౌన్లు..ఆంక్షలు..ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కూడా పోయే వెసులుబాటు లేని పరిస్థితులు వచ్చాయి. లాక్ డౌన్ ఎత్తేసినా కూడా అందరూ భయంభయంగానే తిరుగుతున్నారు. కారణం కరోనా కేసులు ఏ మాత్రం తగ్గకుండా రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) చీఫ్ ట్రెడోస్ అథనోమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కనుచూపు మేరలో కరోనాకు ముందు ఉన్న సాధారణ పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కడా కన్పించటం లేదని ప్రకటించారు. కాకపోతే కోవిడ్ 19ను నియంత్రించేందుకు రోడ్డుమ్యాప్ ను ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. దీని ద్వారా మన జీవితాలు అలా ముందుకుసాగిపోతాయన్నారు.

ఏ దేశంలో ఇప్పుడు కరోనా మహమ్మారి ఏ స్థాయిలో ఉంది అనే అంశాన్ని పక్కన పెట్టి నిర్ణయాత్మక చర్యలతో రంగంలోకి దిగితే ఇది సాధ్యం అవుతుందని తెలిపారు. ప్రపంచంలో 80 శాతం కేసులు పది దేశాల నుంచే వస్తున్నాయని..అందులో 50 శాతం కేసులు రెండు దేశాల నుంచే ఉన్నాయని తెలిపారు. కాకపోతే మరణాల సంఖ్య నిలకడగా ఉంటోందని..ఇది ఆందోళన కలిగించే అంశమన్నారు. కాకపోతే దేశాలు అన్నీ ప్రస్తుతం మరణాలను తగ్గించి..వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో ప్రభుత్వాలు ఆయా ప్రాంతాల్లోని ప్రజలను భాగస్వాములను చేయాలని కోరారు. ఇది ఎంతో ముఖ్యమైన అంశం అని తెలిపారు.

Next Story
Share it