Telugu Gateway
Latest News

వ్యాక్సిన్ డెడ్ లైన్ వివాదం..ఐసీఎంఆర్ వివరణ

వ్యాక్సిన్ డెడ్ లైన్ వివాదం..ఐసీఎంఆర్ వివరణ
X

ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి దృష్ట్యా ఆగస్టు 15 నాటికల్లా కోవిడ్ 19 వ్యాక్సిన్ వచ్చేలా అందరూ సత్వరమే అనుమతులు మంజూరు చేయాలంటూ భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) జారీ చేసిన నోట్ దేశంలో పెద్ద దుమారమే రేపింది. ఎన్నో దశలు దాటాల్సిన వ్యాక్సిన్ పరిశోధనల విషయంలో ఇలా తొందరపెట్టడం ఏమిటి?. ఇది ఏ మాత్రం సరికాదంటూ ఈ రంగంలోని నిపుణుల నుంచి ఐసీఎంఆర్ అంతర్గతంగా సర్కులేట్ చేసిన నోట్ పై తీవ్ర ఆందోళన వ్యక్తం అయింది. దీంతో ఐసీఎంఆర్ ఈ అంశంపై శనివారం నాడు వివరణ ఇచ్చింది. ఐసీఎంఆర్ తాజాగా సర్కులేట్ చేసిన నోట్ ఆగస్టు 15 నాటికి దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రపంచ స్థాయి ప్రమాణాల మేరకే కరోనా వ్యాక్సిన్ తయారీ, పరీక్షలు నిర్వహిస్తామని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ఎక్కడా అలసత్వం ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఈ లేఖ రాశాం తప్ప...అన్ని నిబంధనలు..పద్దతులు ఖచ్చితంగా పాటించి తీరతామని స్పష్టం చేసింది. దేశీయంగా వ్యాక్సిన్ తయారీకి ‘భారత్ బయోటెక్‌’కు అనుమతి ఇచ్చామని.. ఐసీఎంఆర్, నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి ఆ కంపెనీ కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తోందని పేర్కొంది. లోతైన పరిశీలన, డేటా విశ్లేషణ తర్వాతే కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌ కు అనుమతిస్తామని స్పష్టం చేసింది.

భారత్‌ బయోటెక్‌ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్‌ ‘కోవాక్సిన్‌’ను మానవులపై ప్రయోగించేందుకు భారత డ్రగ్‌ కంట్రోలర్‌ అనుమతి లభించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ లో పాల్గొనే వారు జూలై 7లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, ఆగస్టు 15వ తేదీలోగా కోవాక్సిన్‌ను ఆవిష్కరించాలంటూ ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరామ్‌ భార్గవ గురువారం లేఖ రాయడం పట్ల వైద్య నిపుణులు, పరిశోధనా వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. అదే విధంగా మానవులపై ట్రయల్స్‌ జరగకముందే వ్యాక్సిన్‌ విడుదలకు తేదీని ఎలా ఖరారు చేస్తారని విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో శనివారం ఈ మేరకు స్పందించిన ఐసీఎంఆర్‌.. భారత్‌ బయోటెక్‌ ప్రీ క్లినికల్‌ డేటాను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే డ్రగ్స్‌ కంట్రోలర్‌ అనుమతించారని ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారమే అన్ని పద్దతులు అనుసరిస్తామని..ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. ఓ వైపు మానవులపై..మరో వైపు జంతులపై ట్రయల్స్ సమాంతరంగా నడుస్తాయని పేర్కొన్నారు. తాము చేసే పరీక్షలు అన్నీ అత్యుత్తమ విధానాల్లోనే ఉంటాయని..డేటా సేఫ్టీ మానిటరింగ్ బోర్డు (డీఎస్ఎంబీ) వీటిని సమీక్షిస్తుందని తెలిపారు. తమ ఆదేశాలపై వివిధ వర్గాల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.

Next Story
Share it