Telugu Gateway
Latest News

28 ఏళ్ల క్రితం మాటిచ్చాడు..స్నేహితుడికి లాటరీలో వాటా ఇచ్చాడు

28 ఏళ్ల క్రితం మాటిచ్చాడు..స్నేహితుడికి లాటరీలో వాటా ఇచ్చాడు
X

కొంత మంది మాట అంటే మాటే. మరికొంత మందికి మాట మర్చిపోవటం అంటే అదో సరదా ఆట. ఇప్పుడు రెండవ కోవకు చెందిన వారే ఎక్కువ మంది ఉంటారు. కానీ వీళ్లిద్దరూ మాత్రం అలా కాదు. ఇచ్చిన మాటకు...స్నేహానికి విలువ ఇవ్వటం అంటే చేతల్లో చూపించారు. వాళ్లిద్దరి పేర్లు థామస్ కుక్. జోసెఫ్ ఫెనీ. ఇద్దరూ ప్రాణ స్నేహితులు. ఇద్దరికీ లాటరీ కొనే అలవాటు ఉంది. వారం వారం లాటరీ టిక్కెట్లు కొంటారు. వాళ్లిద్దరూ ఓ మాట అనుకున్నారు. ఇద్దరిలో ఎవరికి లాటరీ తగిలినా చెరి సగం పంచుకుందామనుకున్నారు. ఈ మాట అనుకున్నది ఎప్పుడో 28 సంవత్సరాల క్రితం. అయినా సరే మాట తప్పకుండా తనకు వచ్చిన జాక్ పాట్ లో వాటాను ముందు చెప్పినట్లుగానే తన స్నేహితుడికి కూడా సగం ఇఛ్చేశాడు. ఏడాది క్రితం చెప్పిన మాటను కూడా అమలు చేయని మనుషులు ఉన్న ఈ రోజుల్లో ఎప్పుడో 28 సంవత్సరాల క్రితం ఇఛ్చిన మాటను అమలు చేయటం అంటే మామూలు విషయం కాదు.

తాజాగా జాక్ పాట్ తగిలింది థామస్ కుక్ కు. ఈ 22 మిలియన్ డాలర్లను నగదు రూపంలో తీసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇద్దరూ. కష్టపడి పనిచేసే తత్వం ఉన్న కుక్ ఇప్పుడు ఇక తన ఉద్యోగాన్ని వదిలేసి తన స్నేహితుడు ఫెనీతో కలసి రిటైర్మెంట్ జీవితాన్ని గడిపేస్తున్నాడు. ఇద్దరికీ లాటరీలో తగిలిన మొత్తం పన్నులు పోను ఒక్కొక్కరికి 5.7 మిలియన్లు అందింది. వీళ్లిద్దరూ కొద్ది కాలం క్రితం భార్యలతో కలసి రోడ్డు ట్రిప్ కు వెళ్ళారు. ఇఫ్పుడు మరోసారి అదే తరహా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే ఈ సారి ట్రిప్ కాస్త భిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

Next Story
Share it