మాస్క్ తో తొలిసారి డొనాల్డ్ ట్రంప్

ప్రపంచంలోని అత్యధిక కరోనా కేసులు ఉన్నది అమెరికాలోనే. ఈ వైరస్ ఆ దేశాన్ని అంతలా అతలాకుతలం చేసింది. ఇందులో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాత్రపై చాలా విమర్శలే ఉన్నాయి. సకాలంలో చైనా నుంచి ముఖ్యంగా వుహాన్ నుంచి అమెరికాకు వచ్చే విమానాలను సకాలంలో ఆపలేకపోవటం వల్లే న్యూయార్క్ వంటి నగరం కరోనాకు కేంద్రంగా మారిందని అక్కడి పత్రికలు కథనాలు వెలువరించాయి. అమెరికాను కరోనా అంతగా వణికిస్తున్నా సరే ట్రంప్ ‘నేను మాత్రం మాస్క్ వేసుకోను. ఇష్టం వచ్చినవాళ్ళు వేసుకోండి’ అంటూ చాలాసార్లు బాధ్యతారాహిత్య ప్రకటనలు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) దగ్గర నుంచి వైద్యరంగంలోని నిపుణులు అందరూ బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాస్క్ లు ధరించటం వల్ల వైరస్ సోకే ప్రభావం తగ్గుతుందని ప్రకటించారు. అయినా సరే ‘నేను మాస్క్ వేసుకోవటం లేదు ’ చూడండి అంటూ ట్రంప్ ఎన్నోసార్లు వ్యాఖ్యానించారు. కానీ సడన్ గా ఆయన నల్ల మాస్క్ ధరించి కన్పించారు అందరికీ . కానీ ఇప్పుడు మాత్రం మార్చారు.
మేరీలాండ్‌లో ఓ సైనిక ఆస్పత్రిని సందర్శించిన సందర్భంలో మాస్క్ ధరించారు. సైనిక వైద్య కేంద్రంలో గాయపడిన సైనికులను, కరోనాతో పోరాడే ఆరోగ్య కార్యకర్తలను కలుసుకున్నారు. ‘నేను మాస్క్ ను తప్పక ధరించాలి...పెద్దసంఖ్యలో సైనికులు, రోగులను కలిసేందుకు ఆస్పత్రిని సందర్శించినప్పుడు మాస్క్ అవసరం అనివార్యం..మహమ్మారిని అధిగమించే క్రమంలో మాస్క్ ను ధరించడం గొప్ప విషయ’మని ట్రంప్ వ్యాఖ్యానించారు. మాస్క్ లకు తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదని, మాస్క్ వేసుకునేందుకు తగిన సమయం, సందర్భం అవసరమని తాను భావిస్తానని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తర్వాత బహిరంగ ప్రదేశంలో మాస్క్‌తో ట్రంప్ కనిపించడం ఇదే తొలిసారి. మాస్క్ తో విలేకరులను ఉద్దేశించి మాట్లాడేందుకు ట్రంప్ నిరాకరించారు. ట్రంప్ మాస్క్ ధరించడంపై మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ ప్రచారకర్తలు స్పందించారు. అమెరికన్లను మాస్క్ ధరించకుండా నిరాశపరిచేలా ట్రంప్ చాలా సమయం వృధా చేశారని, బిడెన్ మాత్రం ఆరంభం నుంచే మంచి సంప్రదాయం నెలకొల్పారని వ్యాఖ్యానించారు.