Telugu Gateway
Latest News

ట్రంప్ ‘రివర్స్ గేర్’..విద్యార్ధులకు ఊరట

ట్రంప్ ‘రివర్స్ గేర్’..విద్యార్ధులకు ఊరట
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కు తగ్గారు. విదేశీ విద్యార్ధులకు సంబంధించి తాజాగా జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకున్నారు. అమెరికాలో ఉంటూ ఆన్ లైన్ క్లాస్ లకు మాత్రమే హాజరు అవుతున్న విదేశీ విద్యార్ధులు దేశం వదిలి వెళ్లాల్సి ఉంటుందని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అమెరికాలో ఉండాలంటే ఎక్కడైతే యూనివర్శిటీల్లో క్లాస్ లు జరుగుతున్నాయో అక్కడకు అడ్మిషన్ మార్చుకోవాలని..లేదంటే వెళ్లిపోవాల్సిందే అంటూ ఆదేశాలు వెలువరించారు. ఈ నిర్ణయంపై అమెరికాలోని అగ్రశ్రేణి యూనివర్శిటీలు అన్నీ ట్రంప్ ను కోర్టుకు లాగాయి. ఆ యూనివర్శిటీలకు దేశంలో దిగ్గజ ఐటి కంపెనీలు కూడా మద్దతు పలికాయి. దీంతో ట్రంప్ వెనక్కు తగ్గక తప్పని పరిస్థితి ఏర్పడింది.

తాజాగా జారీ చేసిన యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ (ఐసీఈ) ఆదేశాలను వెనక్కు తీసుకునేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఫెడరల్ న్యాయమూర్తి అల్లీసన్ బురోగ్స్ వెల్లడించారు. తద్వారా లక్షలాది విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. 2020-21 విద్యా సంవత్సరానికి గాను పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరయ్యే వారికి వీసాలు జారీ చేయబోమని ప్రకటించి పెద్ద దుమారాన్ని రేపింది. నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా ఎఫ్‌-1, ఎం-1పై ప్రస్తుతం అమెరికాలో ఉంటూ ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్న వారు కూడా దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని ఐసీఈ ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్ని వర్గాల నుంచి ఎదురైన విమర్శలకు ట్రంప్ వెనక్కి తగ్గి తన పాత దేశాలను ఉపసంహరించుకున్నారు.

Next Story
Share it