Telugu Gateway
Latest News

ఈ ఏడాది చివరికే కరోనా వ్యాక్సిన్!

ఈ ఏడాది చివరికే కరోనా వ్యాక్సిన్!
X

వైట్ హౌస్ సలహాదారు అంటోనీ ఫౌచీ అంచనా

కొత్త సంవత్సరంలోకి..కోటి ఆశలతో..!

వైట్ హౌస్ లో వైద్య సలహాదారు, అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు అంటోని ఫౌచీ కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది చివరి నాటికి కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఆలశ్యం అయితే 2021 ప్రారంభంలో మాత్రం ఖాయం అని స్పష్టం చేశారు. ఆయన కరోనా వ్యాక్సిన్ పై మాట్లాడటం ఇదే మొదటిసారి. కరోనా నియంత్రణ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన సలహాలను పెడచెవిన పెట్టారని తొలుత వార్తలు వచ్చాయి. ఏ విషయం అయినా కుండబద్దలు కొట్టినట్లు చెప్పటం ఆయన నైజం. ఫౌచీ అమెరికాలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ ఫెక్షియస్ డిసీజెస్ సంస్థ డైరక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇదే సంస్థ అమెరికాకు చెందిన మోడెర్నాతో కలసి వ్యాక్సిన్ అభివృద్ధి చేసే పనిలో ఉంది.

కరోనా వంటి వైరస్ లను ఎదుర్కోవాలంటే ప్రపంచ వ్యాప్తంగా దేశాల మధ్య పారదర్శక సహకారం ఎంతో ఉందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పలు వ్యాక్సిన్ పరీక్షలు పురోగతిలో ఉన్నా మూడవ దశ ప్రయోగాల ఫలితాలు రావటానికి అక్టోబర్ అవుతుందని తెలిపారు. మోడెర్నా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ సానుకూల ఫలితాలు ఇస్తోందని వెల్లడించారు. అంటోనీ ఫౌచీ వ్యాక్సిన్ పై చేసిన ప్రకటనతో ఎంతో మందిలో ఆశలు రేగాయి. ఏ దేశం నుంచి వస్తుందనే విషయం ఇప్పటికిప్పుడు తేలకపోయినా ఈ సంవత్సరాంతం నాటికి మాత్రం కరోనా వైరస్ కు వ్యాక్సిన్ రావటం మాత్రం ఖాయంగా కన్పిస్తోందని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. కాస్త అటు ఇటుగా అయిన కొత్త సంవత్సరంలోకి కొత్త ఆశలతో ప్రవేశించే అవకాశాలు మాత్రం పక్కా అంటున్నారు.

హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ అభివృద్ధి చేసే వ్యాక్సిన్ ఆగస్టు 15 నాటికి రెడీ అవుతుందని ప్రకటించిన ఐసీఎంఆర్ పెద్ద కలకలమే రేపింది. ఒక రకంగా ఈ ప్రకటన కోట్లాది మంది ప్రజల్లో ఎన్నో ఆశలు రేకెత్తించింది. అయితే ఈ రంగంలోని నిపుణులు అందరూ రంగంలోకి దిగి ఆగస్టు 15లోగా వ్యాక్సిన్ విడుదల సాధ్యం అయ్యే పనికాదని..ఇలాంటి వ్యవహారాల్లో రాజకీయ జోక్యం సరికాదంటూ ఘాటు విమర్శలు చేశారు. దీంతో ఐసీఎంఆర్ కూడా వెనక్కి తగ్గి..తాము అనుమతుల విషయంలో అలసత్వం వద్దని చెప్పేందుకు మాత్రమే అలా చేశామని వివరణ ఇచ్చుకున్న విషయం తెలిసిందే.

Next Story
Share it