Telugu Gateway
Latest News

సచిన్ పైలట్ పై వేటు వేసిన అధిష్టానం

సచిన్  పైలట్ పై వేటు వేసిన అధిష్టానం
X

కాంగ్రెస్ అధిష్టానం మెట్టు దిగలేదు. రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ డిమాండ్లను పట్టించుకోలేదు. అంతే కాదు. సచిన్ పైలట్ పై వేటు వేసింది. ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి, రాజస్థాన్ పీసీసీ అధ్యక్ష పదవుల నుంచి తప్పించింది. పైలట్ తోపాటు ఆయనతో ఉన్న ఇద్దరు మంత్రులపై కూడా వేటు పడింది. గత కొన్ని రోజులుగా నాటకీయ పక్కీలో సాగుతున్న రాజస్థాన్ రాజకీయ పరిణామాలు మంగళవారం నాడు క్లైమాక్స్ కు చేరినట్లే కన్పిస్తున్నాయి. తొలుత సచిన్ పైలట్ బిజెపి వైపు మొగ్గుచూపుతారని ప్రచారం జరిగింది. కానీ అందుకు భిన్నంగా పైలట్ అటువైపు వెళ్ళకుండా ప్రస్తుతానికి కాంగ్రెస్ అధిష్టానానికి చికాకు పెట్టే పనిలో ఉన్నారు. దీంతో అధిష్టానం కూడా రంగంలోకి దిగి అశోక్ గెహ్లాట్ మంత్రివర్గం నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. పైలట్ తోపాటు రమేష్ మీనా, విశ్వేంద్ర సింగ్ లపై కూడా మంత్రివర్గం నుంచి వేటు పడింది. దీంతో అసలు రాజకీయం ఇక ఇప్పుడే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. సచిన్ పైలట్ వైపు ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్లంతా ఇప్పుడు ఏమి చేస్తారు?. బిజెపి వైపు జత కడతారా?. లేక అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తూ లేఖ ఇస్తారా?. ఏమి జరుగుతుందో వేచిచూడాల్సిందే.

సచిన్ పైలట్ సొంతంగా పార్టీ పెడతారని కూడా సోమవారం నాడు వార్తలు వచ్చాయి. అయితే ఆయన మాత్రం ఇంత వరకూ ఎక్కడా ఈ అంశాలపై మాట్లాడటం లేదు. బలం ఉంటే అశోక్ గెహ్లాట్ అసెంబ్లీలో నిరూపించుకోవాలని మాత్రమే సవాల్ విసిరారు. పార్టీలో తిరిగి రావాలని రాహుల్ గాంధీ, ప్రియాంక, చిదంబరంతోపాటు పలువురు సీనియర్ నేతలు మాట్లాడినా కూడా సచిన్ పైలట్ ఏ మాత్రం తగ్గలేదు. దీంతో రాజస్థాన్ రాజకీయాలు ఇప్పుడు మరింత రసకందాయంలో పడ్డాయి. ప్రస్తుతానికి అయితే అశోక్ గెహ్లాట్ సర్కారు తమకు పూర్తి మెజారిటీ ఉందని చెబుతోంది. ఈ లెక్కలపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Next Story
Share it