Telugu Gateway
Latest News

వైరస్ పుట్టించిన చైనానే వ్యాక్సిన్ లోనూ ముందంజ

వైరస్ పుట్టించిన చైనానే వ్యాక్సిన్ లోనూ ముందంజ
X

మూడవ దశకు చేరుకున్న సినోవాక్ వ్యాక్సిన్ ప్రయోగాలు

ప్రపంచానికి కరోనా వైరస్ ను అంటించింది చైనానే. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ఏకంగా దానికి చైనా వైరస్ అని పేరు పెట్టారు. దీనిపై ఆ దేశం అభ్యంతరం వ్యక్తం చేసినా అవును..కరోనా పుట్టింది అక్కడే కాబట్టి నేను అంతే పిలుస్తా అని కూడా తేల్చిచెప్పారు. ఇప్పుడు వైరస్ పుట్టించిన చైనా దేశంలోనే దీన్ని నిరోధించేందుకు అవసరమైన వ్యాక్సిన్ తయారీకి కూడా రెడీ అవుతోంది. రెడీ అవటమే కాదు..ఇతర దేశాలతో పోలిస్తే చైనా ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉంది. భారత్ లో ఇప్పుడే క్లినికల్ ట్రయల్స్ 1, 2 దశలకు చేరుకోగా..చైనా లో మాత్రం సినోవాక్ కంపెనీ మూడవ దశ ప్రయోగాలకు సిద్ధం అవుతున్నట్లు ప్రకటించింది. ఈ సంస్థ తొలి, రెండవ దశ క్లినికల్ ట్రయల్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకొని మానవులపై జరుపుతున్న పరీక్షలకు సంబంధించి చివరి దశను త్వరలోనే ప్రారంభించబోతున్నట్టు తెలిపింది. దీని కోసం బ్రెజిల్ వ్యాక్సిన్ తయారీదారు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బుటాంటన్‌తో ఒప్పందం చేసుకుంది.

ఈ రెండు సంస్థలు కలసి చేయబోయే ఈ అధ్యయనంలో కోవిడ్ 19 ఆసుపత్రులలో పనిచేస్తున్న దాదాపు 9,000 మంది ఆరోగ్య నిపుణులను నియమించుకుంటామని కంపెనీ వెల్లడించింది. బ్రెజిల్ లో నిర్వహించే ట్రయల్స్ కు వాలంటీర్ల ఎంపిక ఈ నెలలోనే ఉంటుందని తెలిపింది. ఈ ట్రయల్స్ కు సంబంధించి గత వారమే చైనా కంపెనీకి బ్రెజిల్ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి చివరిలో టీకా తయారీ పనులను సినోవాక్ ప్రారంభించింది. సంవత్సరానికి 100 మిలియన్ డోస్ల ఉత్పత్తి సామర్ధ్యంతో కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీ ప్లాంట్‌ను సిద్ధం చేస్తోంది. ఇది ఈ సంవత్సరం చివరి నాటికి సిద్ధం అవుతుందని సినోవాక్ ధీమా. వాక్సిన్ తయారీలో చివరి దశకు చేరుకున్నమూడు కంపెనీలలో ఒకటిగా సినోవాక్ నిలిచింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెన్ కా సంయుక్తంగా తీసుకొస్తున్న వాక్సిన్ ప్రస్తుతం ఫేజ్ 3 లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పాటు సినోఫాం (చైనా నేషనల్ ఫార్మాస్యూటికల్ గ్రూప్) కు చెందిన వ్యాక్సిన్ కూడా ఫేజ్ 3 పరీక్షల దశలో ఉంది.

Next Story
Share it