Telugu Gateway
Latest News

ఆగస్టు 1 నుంచి థియేటర్లకు అనుమతి?!

ఆగస్టు 1 నుంచి థియేటర్లకు అనుమతి?!
X

దేశవ్యాప్తంగా ఉన్న మల్టీఫ్లెక్స్ లతోపాటు థియేటర్ల సంఘాలు ఎప్పటి నుంచో సినిమాల ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాయి. మల్లీఫ్లెక్స్ లు, థియేటర్లు మూసివేయటం వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని..తమకు కూడా పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వాలు పెట్టే కోవిడ్ 19 షరతులను అమలు చేస్తామని..సీటుకు సీటు కు మధ్య దూరం పెట్టి కరోనా పోరుకు సహకరిస్తామని ఇప్పటికే ఓ వినతిని కూడా కేంద్రానికి అందజేశాయి. మల్టీఫ్లెక్స్ లతోపాటు థియేటర్లు కూడా దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుని రెడీగా ఉన్నాయి. కాకపోతే కేంద్రం నిర్ణయం తీసుకోవటమే తరువాయి. అయితే ఓ వైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అయినా సరే ప్రభుత్వాలు పలు మినహాయింపులు ఇచ్చుకుంటూ ముందుకు సాగుతున్నాయి. జులై 31తో అన్ లాక్ 2 గడువు ముగియనుంది. దీంతో కొత్త మార్గదర్శకాల జారీ అనివార్యం కానుంది. ఈ తరుణంలో ఈ సారి థియేటర్లకు అనుమతి లభిస్తుందని చెబుతున్నారు. అయితే 50 శాతం సామర్ధ్యంతో థియేటర్లు నిర్వహిస్తామని నిర్వాహకులు చెబుతుంటే..కేంద్రం మాత్రం తొలి దశలో 25 శాతం సామర్ధ్యాలతోనే నడపాలని కోరుతోంది.

దీనిపై తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. దీంతోపాటు రాష్ట్రాలకు కూడా ఈ సామర్ధ్యంపై నిర్ణయాలను కేంద్రం వదిలిపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. అన్ లాక్ 3లో థియేటర్లతోపాటు పార్కులు, జిమ్ లకు మినహాయింపులు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ప్రజారవాణాకు సంబంధించిన మెట్రో రైలు, ఇతర రైళ్ళ నిర్వహణకు మరికొంత కాలం అనుమతులు లభించకపోవచ్చని భావిస్తున్నారు. పాఠశాలలు, కాలేజీలు సహా ఇతర విద్యాసంస్ధలు ఏవీ కూడా ఇప్పట్లో తెరిచే అవకాశం లేదు. దీనిపై ఇప్పటికే కేంద్రం పలు రాష్ట్రాల నుంచి సలహాలు కోరుతూ లేఖలు రాసింది. వ్యాక్సిన్ అందుబాటులోకి రావటం లేదా కరోనా తీవ్రంగా గణనీయంగా తగ్గితే తప్ప స్కూళ్లు, కాలేజీల విషయంలో స్పష్టత రాకపోవచ్చని సమాచారం.

Next Story
Share it