వికాస్ దూబే ఎన్ కౌంటర్

వికాస్ దూబే. గత కొన్ని రోజులుగా నిత్యం వార్తల్లో నిలిచిన వ్యక్తి. ఏదైనా మంచి పని చేసి అనుకుంటే పొరపాటే. ఏకంగా ఎనిమిది మంది పోలీసులను కాల్చి దేశమంతటా పెద్ద కలకలానికి కారణం అయ్యాడు. ఈ ఘటనతో ఉత్తరప్రదేశ్ సర్కారు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ వెంటనే తేరుకుని రంగంలోకి దిగింది. పోలీసులను చంపిన గ్యాంగ్ స్టర్ నాయకుడు వికాస్ దూబే శుక్రవారం ఉదయం ఎన్ కౌంటర్ లో మరణించాడు. పోలీసులు విస్తృత గాలింపుల తర్వాత దూబేను మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో పట్టుకుని ఉత్తరప్రదేశ్ తీసుకొచ్చారు. శుక్రవారం నాడు దూబేను ప్రత్యేక వాహనంలో కాన్పూర్‌కు తరలిస్తుండగా.. పోలీసుల ఎస్కార్ట్ లోని ఆ వాహనం బోల్తా పడింది. దీనిని అదనుగా తీసుకున్న వికాస్ పారిపోయేందుకు ప్రయత్నిస్తే పోలీసులు కాల్పులు జరిపి దూబే ను ఎన్ కౌంటర్ చేసినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో కొంత మంది పోలీసులకు కూడా గాయాలు అయ్యాయి. పోలీసులపై కాల్పులు జరిపిన అనంతరం వికాస్ దూబే రాష్ట్రం విడిచి పారిపోగా.. అతడి ఆచూకీ చెప్పిన వారికి నగదు బహుమతి ఇస్తామని పోలీసు శాఖ ప్రకటించింది.
అయినప్పటికీ అతడి గురించి ఎటువంటి సమాచారం తెలియకపోవడంతో రూ. 50 వేల నుంచి 5 లక్షలకు రివార్డును పెంచారు. ఈ క్రమంలో ఎట్టకేలకు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహంకాలి గుడిలో అతడు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్థానిక పోలీసులు వికాస్‌ను అరెస్టు చేయగా.. అక్కడికి చేరుకున్న యూపీ పోలీసులు అతడిని ప్రత్యేక వాహనంలో శుక్రవారం ఉదయం కాన్పూర్‌కు తీసుకు వచ్చే ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఎస్కార్ట్ లోని వాహనం బోల్తా పడటంతో వికాస్ పారిపోయేందుకు ప్రయత్నించగా కాల్పులు జరిపారు. ఎప్పటిలాగానే పోలీసుల ఎన్ కౌంటర్ పై విమర్శలు విన్పిస్తున్నాయి. బోల్తా కొట్టిన కారుకు కనీసం అద్దాలు కూడా పగలలేదని చెబుతున్నారు. అన్నింటి కంటే మరో విశేషం ఏమిటంటే దూబే ఎక్కువ చేస్తే చంపాస్తామేమో అంటూ ఐజీ అమితాబ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. ఒక్క మాటల చెప్పాలంటే దూబే ఎన్ కౌంటర్ పై పోలీసులు ముందే హింట్ ఇచ్చారు.