Telugu Gateway
Latest News

ప్రపంచమా మాస్క్ లు లేకుండా ఊపిరిపీల్చుకో!

ప్రపంచమా మాస్క్ లు లేకుండా ఊపిరిపీల్చుకో!
X

గుడ్ న్యూస్ ..ఆగస్టు 15 నాటికి కరోనా వ్యాక్సిన్

భారత్ బయోటెక్ నుంచే..ఐసీఎంఆర్ ప్రకటన

ప్రపంచం ఇక మాస్క్ లు లేకుండా స్వేచ్చగా ఊపిరిపీల్చుకునే రోజులు రాబోతున్నాయా?. అంటే ఆ రోజులు దగ్గర్లోనే ఉన్నట్లు కన్పిస్తున్నాయి. ఎందుకంటే భారత్ కు చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) నోట్ ప్రకారం ఆగస్టు 15 నాటికి భారత్ నుంచే తొలి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అన్ని క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసిన తర్వాత ఇది వస్తుందని స్పష్టం చేసింది. భారత్ బయోటెక్ ఇండియా లిమిటెడ్ (బీబీఐఎల్) ఈ లక్ష్యాన్ని అందుకునేందుకు శరవేగంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. అయితే వ్యాక్సిన్ కు సంబంధించి తుది నిర్ణయం మాత్రం ఈ ప్రాజెక్టులో భాగస్వాములు అయిన అన్ని క్లినికల్ ట్రయల్ సైట్స్ సహకారంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రజారోగ్య అత్యవసర స్థితిని దృష్టిలో పెట్టుకుని వ్యాక్సిన్ ను అందుబాటులోకి తేవటం చాలా ముఖ్యం అని పేర్కొన్నారు.

అందుకు క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించి అన్ని అనుమతులను పరిశీలిస్తూ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. తాము చెప్పిన ప్రకారం నిబంధనలు పాటించకపోతే మాత్రం తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు ఉన్న అత్యవసర ప్రాధాన్యత దృష్ట్యా ఎక్కడా సమయం దుర్వినియోగం కాకుండా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తాజాగా భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్లా కూడా కేంద్రం అనుమతులపైనే వ్యాక్సిన్ ఎంత తొందరంగా అందుబాటులోకి వస్తుందని వెల్లడించిన విషయం తెలిసిందే. ఐసీఎంఆర్ నోట్ పరిశీలిస్తే కేంద్రం ఈ అనుమతుల విషయంలో ఏ మాత్రం జాప్యం చేయదనే విషయం స్పష్టం అవుతోంది.. ఈ లెక్కన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజే భారత్ తోపాటు ప్రపంచానికి కూడా కరోనా నుంచి విముక్తి కలగాలని ఆశిద్దాం.

Next Story
Share it