విశాఖ రాజధానిగా వద్దనటానికి ఆయనెవరు?

వైసీపీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. రాజధాని విశాఖలో వద్దనటానికి ఆయన ఎవరు అని ప్రశ్నించారు. జగన్ బిక్షతోనే ఆయన ఎంపీగా గెలిచారని..ఈ విషయం గుర్తుంచుకుని మసలుకోవాలన్నారు. ఆయన నర్సాపురం వరకూ పరిమితం అయితే బాగుంటుందని..ఇతర అంశాల్లో జోక్యం చేసుకోవటం మానుకోవాలన్నారు. అవంతి శ్రీనివాస్ ఆదివారం నాడు విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలకంటే రఘురామకృష్ణంరాజు ఎక్కువ విమర్శలు చేస్తున్నారని అన్నారు.
పార్టీ విధానాలు నచ్చకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని రఘురామకృష్ణంరాజుకు సూచించారు. నలందా కిషోర్ అనారోగ్యంతో మృతి చెందారని, ఆ మరణాన్ని కూడా చంద్రబాబు, లోకేష్ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కిషోర్ టీడీపీ అభిమాని. ఆయన మరణానికి మేము కూడా సంతాపం తెలియజేస్తున్నాము. కరోనా ఎవరికైనా వస్తుంది. పార్టీలతో సంబంధం లేదు. నలందా కిషోర్‌ను పోలీసులు కర్నూలు తీసుకువెళ్లడంతో మరణించారని చెప్పటం సరికాదన్నారు.