Telugu Gateway
Latest News

అర్ణాబ్ గోస్వామికి షాకిచ్చిన నటి కస్తూరి!

అర్ణాబ్ గోస్వామికి షాకిచ్చిన నటి కస్తూరి!
X

కస్తూరి. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన నటి. భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ కూతురిగా నటించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. అంతే కాదు ఆమె తెలుగులో చాలా సినిమాలు చేసింది. తాజాగా ఆమెకు చెందిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటి అంటే ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి లైవ్ లోనే భోజనం చేసేసింది. ఆ వీడియో బిట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె తాజాగా రిపబ్లిక్ టీవీలో అర్ణాబ్ గోస్వామి బాలీవుడ్ లో బంధుప్రీతిపై నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు.

అందులో పలువురు నటీమణులతోపాటు కస్తూరి కూడా పాల్గొన్నారు. అందులోనే ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై కస్తూరి కూడా ట్విట్టర్ ద్వారా స్పందించింది. ‘అర్ణబ్ ను హైపర్ మోడ్ లో ఓ అరవై నిమిషాల పాటు చూశాను. ఆయన ఎలాగూ నన్ను మాట్లాడనివ్వరు. అందుకే నేను వెళ్ళి లంచ్ తెచ్చుకున్నాను. ’ అని పేర్కొన్నారు. అదే సమయంలో స్కైప్ సైన్ ఆఫ్ చేయటం మర్చిపోయానని..అంతే తప్ప ఎవరినీ అగౌరపర్చే ఉద్దేశం తనకు లేదన్నారు. అయితే ఈ పరిణామంపై ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఓ నెటిజన్ పై ఫోటోను షేర్ చేస్తూ అర్ణాబ్ మాటలను తినేస్తుంది అని కామెంట్ చేశాడు.

Next Story
Share it