Telugu Gateway
Andhra Pradesh

ఢిల్లీలో రఘురామకృష్ణంరాజు హల్ చల్

ఢిల్లీలో రఘురామకృష్ణంరాజు హల్ చల్
X

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో వరస పెట్టి భేటీలు వేస్తున్నారు. శుక్రవారం నాడు ఎన్నికల సంఘం అధికారులతో పాటు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీ అయిన రఘురామకృష్ణంరాజు శనివారం నాడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కూడా కలిశారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని..కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరినట్లు భేటీల అనంతరం రఘురామకృష్ణంరాజు మీడియాకు తెలిపారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో తనను తీవ్రంగా దుర్భాషలాడటంతోపాటు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎంపీ ఆరోపించారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ గొడవలన్నింటికీ విజయసాయిరెడ్డే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ను కలిసే అవకాశం వస్తుందని అనుకోవట్లేదన్నారు.

అయినా ఈ మధ్య సీఎం.. కొంత మంది ఎమ్మెల్యేలను కలుస్తున్నట్లు వార్తలొస్తున్నాయని... మరి తన వంతు ఎప్పుడొస్తుందో తెలియదని వ్యాఖ్యానించారు. సీఎం అవకాశం ఇస్తే తప్పకుండా కలుస్తానని తెలిపారు. షోకాజ్ నోటీసుపై న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు వెల్లడించారు. నోటీసులో ఉన్న అన్ని అంశాలకూ సీఎం జగన్‌కు సమాధానం చెబుతానన్నారు. అయినా తాను పార్టీని పల్లెత్తుమాట అనలేదని చెప్పారు. కేంద్రం రక్షణ కల్పించాకే నియోజకవర్గానికి వెళ్తానని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. తాను ప్రభుత్వానికి ఒకట్రెండు అంశాల్లో సూచనలు మాత్రమే చేశానని తెలిపారు. టీటీడీ విషయంలో ఓ భక్తుడిగా మాత్రమే మాట్లాడానని తెలిపారు. తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు వెనక్కి తీసుకోవాలన్నారు.

Next Story
Share it