Telugu Gateway
Latest News

రిలయన్స్ జియోలోకి మరో 9093 కోట్ల పెట్టుబడులు

రిలయన్స్ జియోలోకి మరో 9093 కోట్ల పెట్టుబడులు
X

రిలయన్స్ జియో సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొత్తగా జియో ఫ్లాట్ ఫామ్స్ లోకి మరో 9093 కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందం ఖరారు అయింది. అబుదాబికి చెందిన ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ సంస్థ ముబాదలా ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ జియో ఫ్లాట్ ఫామ్స్ లో 1.85 వాటా కొనుగోలుకు ఈ మొత్తం పెట్టుబడిగా పెట్టనుంది. గత ఆరు వారాల్లో రిలయన్స్ జియోలోకి వచ్చిన ఆరవ పెట్టుబడి ఇది. ఈ ఆరు వారాల్లో కంపెనీ పలు సంస్థల నుంచి 87,655 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించింది. ఇందులో ఫేస్ బుక్, సిల్వర్ లేక్ పార్టనర్స్, విస్టా ఈక్వీటీ పార్టనర్స్, జనరల్ అట్లాంటిక్, కెకెఆర్ లు ఉండగా..ఇప్పుడు ముబాదలా వచ్చి చేరింది.

జియో టెక్నాలజీ, బిజినెస్ మోడల్, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలపై నమ్మకానికి ఈ పెట్టుబడులు నిదర్శనం అని రిలయన్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఎంతో నమ్మకంతో రిలయన్స్ జియోలో పెట్టుబడులు పెడుతున్నారని పేర్కొన్నారు. ఆయా కంపెనీలు దేశీయ మార్కెట్ పై లోతైన అవగాహన కలిగి ఉన్నాయన్నారు. అబుదాబి ప్రభుత్వానికి చెందిన ముబాదలా ఐదు ఖండాల్లో 229 బిలియన్ డాలర్ల పెట్టుబడులను నిర్వహిస్తోంది.

Next Story
Share it