Telugu Gateway
Latest News

‘ఉత్తమ్ అవినీతి’కి కెసీఆర్ మినహాయింపు!

‘ఉత్తమ్ అవినీతి’కి కెసీఆర్ మినహాయింపు!
X

మళ్ళీ అధికారంలోకి వచ్చాక చర్యలు అంటూ కెసీఆర్ ప్రకటన

ఏడాదిన్నర దాటినా ఆ ఫైలు వైపు చూడని సర్కారు

‘టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ చేసిన నేరాలు, అక్రమాలకు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ నేతలు ఐదు వేల కోట్ల రూపాయల మేర అక్రమాలకు పాల్పడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హౌసింగ్ మంత్రిగా ఉన్న సమయంలోనే ఇది జరిగింది. కానీ నేను చర్యలకు ఉపక్రమించలేదు. ఎందుకంటే రాష్ట్రంలో పరిష్కరించాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. కానీ మళ్ళీ అదికారంలోకి వచ్చాక వారి అవినీతిని కక్కిస్తా. ’ ఇదీ 2018 నవంబర్ 24న ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ సీఎం కెసీఆర్ చేసిన వ్యాఖ్యలు. గృహ నిర్మాణ శాఖలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అవినీతికి సంబంధించి విచారణ సంస్థల నివేదికలు కూడా ఉన్నాయని అప్పట్లోనే కెసీఆర్ పలుమార్లు ప్రకటించారు. కానీ రెండవ సారి అధికారంలోకి వచ్చి కూడా ఏడాదిన్నర దాటింది. కానీ కెసీఆర్ చెప్పిన ఐదు వేల కోట్ల రూపాయల అక్రమాలకు సంబంధించి కానీ..మరో అంశంలో కానీ చర్యలు శూన్యం.

ఆధారాలు ఉన్నా కూడా అవినీతిపై చర్యలు తీసుకోలేదని ఓ ముఖ్యమంత్రి చెప్పటమే ఓ విశేషం. కానీ ఆయన చెప్పినట్లే రెండవ సారి అధికారంలోకి వచ్చి కూడా ఏడాదిన్నర అయినా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైలు వైపు కన్నెత్తి చూడలేదంటే ఆయనకు ‘ప్రత్యేక మినహాయింపు’ ఇఛ్చినట్లే కన్పిస్తోంది. కాంగ్రెస్ పార్టీలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. మొదటి టర్మ్ లోనే అధికార టీఆర్ఎస్ విషయంలో ఆయన చాలా మెతక వైఖరి అవలంభించారని కొంత మంది కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే విమర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హౌసింగ్ స్కామ్ కారణంగా చాలా వరకూ వెనక్కి తగ్గారని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ను ఢీకొట్టడంలో కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం దూకుడుగా వ్యవహరించటంలేదనే విమర్శలు ఉన్నాయి. ఎన్నో అవకాశాలు కూడా ఉన్నా వాటిని ఉపయోగించుకోవటంలో ప్రతిపక్ష కాంగ్రెస్ విఫలమైందని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తు అయితే సోమవారం నాడు హుజూర్ నగర్ లో జరిగిన సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి కెటీఆర్ లు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకోవటం కాంగ్రెస్ వర్గాలను షాక్ కు గురిచేసిందని ఆ పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Next Story
Share it