Telugu Gateway
Latest News

చైనా ఉత్పత్తుల బహిష్కరణ అంత తేలిగ్గా జరిగే పనేనా?!

చైనా ఉత్పత్తుల బహిష్కరణ అంత తేలిగ్గా జరిగే పనేనా?!
X

పలు రంగాల్లో చైనాపై ఆధారపడిన భారత్

చైనాపై ప్రస్తుతం భారత్ లో పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. భారత్-చైనా సరిహద్దులోని గల్వామాలో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. ఇది దేశంలో చైనాపై విపరీతమైన వ్యతిరేకత పెరగటానికి కారణమైంది. చైనా సైన్యానికి సంబంధించి సుమారు 40 మంది చనిపోయినట్లు సమాచారం వస్తున్నా ఆ దేశం ఈ విషయాలు చెప్పదు. కానీ అగ్రరాజ్యం అమెరికాకు చెందిన సంస్థలు సైతం చైనా సైన్యం తరపున ప్రాణనష్టం 35 మందికిపైనే ఉంటుందని చెబుతున్నాయి. గత కొన్ని నెలలుగా చైనా కవ్వింపులకు పాల్పడుతూ వివాదానికి కారణం అవుతోంది. ఈ తరుణంలో మరోసారి గట్టిగా చైనా ఉత్పత్తులను బాయ్ కాట్ చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. ముఖ్యంగా ఈ డిమాండ్ సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంది. భావోద్వేగాలు వేరు..బిజినెస్ వేరు. అలాగని చైనా ఉత్పత్తులను సమర్ధించటం కాదు. అయితే భారత్ ఎంతగా చైనా ఉత్పత్తులపై ఆధారపడి ఉందో లెక్కలు ప్రస్తావించటం మాత్రమే ఈ కథనం ఉద్దేశం. ఈ లెక్కలు కూడా దేశీయ పారిశ్రామిక రంగానికి చెందిన ప్రముఖ సంస్థ భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఫిబ్రవరిలో కేంద్రానికి సమర్పించిన నోట్ లోని అంశాలే.

ఈ లెక్కలను పరిశీలిస్తే భారత్ పలు కీలక విభాగాల్లో చైనాపై పెద్ద ఎత్తున ఆధారపడుతోంది. ఏ రంగంపై ఎంత అనే వివరాలు కూడా ఈ నోట్ లో ఉన్నాయి. భారత్ చేసుకునే దిగుమతులే ఈ గణాంకాలు. భారత్ దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్స్ లో చైనా వాటా 45 శాతంగా ఉంది. మెషినరి (క్యాపిటల్ గూడ్స్) వాటా 32 శాతం, ఫార్మా ఏపీఐ (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్ గ్రీడియంట్ ) దిగుమతులు 65 నుంచి 70 శాతం వరకూ ఉన్నాయి. ఏపీఐ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మందుల తయారీకి అవసరమైన ముడి పదార్ధాలు. చివరకు ఫర్నీచర్, బెడ్డింగ్ ఉత్పత్తులు కూడా చైనా నుంచి 57 శాతం మేర దిగుమతి అవుతున్నాయి. ఆర్గానిక్ కెమికల్స్ వాటా 38 శాతం, ఆటోమోటివ్ పార్ట్స్ 25 శాతం, ఫెర్టిలైజర్స్ 28 శాతం దిగుమతులు ఉన్నాయి. భారత్ లోని 12 వేల కోట్ల రూపాయల టెలికం ఎక్విప్ మెంట్ మార్కెట్ లో చైనా కంపెనీల వాటా 25 శాతం వరకూ ఉంది. స్మార్ట్ టీవీ మార్కె ట్ లో కూడా కూడా ఆ దేశం వాటా 45 శాతంగా ఉంది.

ఆటోకాంపోనెంట్స్ విభాగంలో చైనా వాటా 25 శాతంగా ఉంది. మారుతి వంటి దిగ్గజ సంస్థలు కూడా చైనా నుంచి కాంపోనెంట్స్ ను దిగుమతి చేసుకుంటున్నాయి. మొబైల్ ఫోన్ మార్కెట్లో అయితే చైనా కంపెనీల హవా చాలా ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. రెండు లక్షల కోట్ల రూపాయల ఈ మార్కెట్ లో చైనా కంపెనీల వాటా 72 శాతంగా ఉంది. కరోనా అనంతరం పరిణామాల అనంతరం భారత్ తోపాటు పలు దేశాలు చైనాపై ఆధారపడటం తగ్గించుకోవాలని చూస్తున్నాయి. అంతే కాదు..అక్కడ నుంచి పలు సంస్థలు తమ యూనిట్లను వేరే దేశాలకు తరలిస్తున్నాయి. వీటిపై భారత్ కూడా పెద్ద ఎత్తున కన్నేసింది. భారత ప్రధాని నరేంద్రమోడీ కూడా (ఆత్మ నిర్భర్ భారత్) స్వీయ ఆధారిత భారత్ కోసం పిలుపునిచ్చారు. ఈ పిలుపు వినటానికి బాగానే ఉన్నా..ఈ స్థాయికి చేరుకోవటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పటం కష్టం అని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. కరోనాతో ఏపీఐ దిగుమతులు ఆగిపోవటంతో ధరలు ఏకంగా 167 శాతం మేర పెరిగాయి. భారత్ ఏయే రంగాల్లో చైనాపై ఎంత మేర ఆదారపడిందనే విషయాలను పైన ఉన్న చిత్రంలో చూడొచ్చు. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ఈ డేటాను ప్రచురించింది.కరోనా అనంతరం చైనా ఉత్పత్తుల బహిష్కరణ నినాదం మరింత జోరందుకున్నా కూడా అమ్మకాల్లో పెద్దగా తేడా కన్పించటంలేదని ఆన్ లైన్ సంస్థలు చెబుతున్నాయి. ముఖ్యంగా సెల్ ఫోన్ల విషయంలో చైనా కంపెనీలు పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డి)పై అధిక దృష్టి పెట్టి వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.

Next Story
Share it