Telugu Gateway
Latest News

అజయ్ కల్లాంకు ‘విచిత్ర పరిస్థితి’

అజయ్ కల్లాంకు ‘విచిత్ర పరిస్థితి’
X

అప్పుడు జీఎంఆర్ ది స్కామ్ అని...ఇప్పుడు మౌనంగా ఎండార్స్ మెంట్!

కొంత మంది అధికారులు రాజకీయల నేతలకూ తమకు పెద్ద తేడా ఉండదని నిరూపించుకుంటున్నారు. ఒకప్పుడు ఎంతో మంచి పేరున్న అధికారిగా ఉన్న మాజీ సీఎస్, ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాన సలహాదారుగా ఉన్న అజయ్ కల్లాం కూడా అదే నిరూపించుకున్నారు. గతంలో భోగాపురం ఎయిర్ పోర్టు స్కామ్ పై తీవ్ర విమర్శలు చేసిన అజయ్ కల్లాం ఇప్పుడు సీఎం ప్రధాన సలహాదారు హోదాలో ఏపీ మంత్రి పేర్ని నాని భోగాపురం విమానాశ్రయం ప్రాజెక్టును జీఎంఆర్ సంస్థకు, పాత టెండర్ల ప్రకారంమే అప్పగిస్తున్నట్లు తెలిపిన విలేకరుల సమావేశంలో మౌనంగా కూర్చోవాల్సి వచ్చింది. అయితే గత ప్రభుత్వం 2500 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయిస్తే తాము..2000 ఎకరాలే ఇస్తున్నామని...ఇందులో విమానాశ్రయం నిర్మించేందుకు జీఎంఆర్ కూడా ఓకే చెప్పిందని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. అంతే కాదు..500 ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉంచుకోవటం ద్వారా ఎకరాకు 3 కోట్ల రూపాయల లెక్కన ధర వేసుకున్నా కూడా 1500 కోట్ల రూపాయలు ఆదా చేసినట్లు సెల్ఫ్ క్లెయిం చేసుకున్నారు. కానీ ఇక్కడ సమస్య భూమి ఎంత అన్నది కాదు. టెండర్లలో గోల్ మాల్ జరిగింది అన్నది.

జీఎంఆర్ కు ప్రాజెక్టు కట్టబెట్టేందుకు అని ...ఏఏఐకి దక్కిన అది కూడా ఆదాయంలో అత్యధిక వాటా ఇస్తామని చెప్పినా కూడా ఆ టెండర్లు రద్దు చేసి..మళ్ళీ కొత్తగా టెండర్లు పిలిచారు చంద్రబాబు జమానాలో. మళ్ళీ పిలిచిన టెండర్లలో కీలక అంశాలను విస్మరించారని..ఇది అత్యంత లోపభూయిష్ట విధానం అని ఆర్ధిక శాఖ తన అభిప్రాయాలను ఫైలులో స్పష్టంగా రాసింది కూడా. అంతే కాదు విమానాశ్రయం టెండర్ల సమయంలో అత్యంత కీలకం అయిన నాన్ ఏరో ఆదాయాన్ని పూర్తిగా విస్మరించారని ..ఇందులోనే అసలు మతలబు ఉందని ఈ రంగ నిపుణులు చెబుతున్నారు. పదేళ్ల తర్వాతే జీఎంఆర్ ప్రభుత్వానికి యూడీఫ్ లో వాటా చెల్లించనుంది. అంతకు ముందు పిలిచిన టెండర్లలో మొత్తం ఆదాయంలో వాటా అని ఉండగా..కొద్ది నెలల వ్యవధిలోనే కేవలం ఒక్కో ప్రయాణికుడి నుంచి వసూలు చేసే యూడీఎఫ్ లో ఎక్కువ ఎవరు ఎక్కువ మొత్తం చెల్లిస్తారు అన్నది టెండర్ ప్రామాణికంగా మార్చారు. ఇదే గోల్ మాల్ వ్యవహారం. ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ నేతలు కూడా భోగాపురం టెండర్లపై తీవ్ర విమర్శలు చేశారు..కేంద్రానికి ఫిర్యాదులు కూడా చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక మాత్రం విమర్శలు చేసిన జీఎంఆర్ కే టెండర్లు ఓకే చేశారు. 2019 మార్చిలో అజయ్ కల్లాం మాట్లాడిన మాటలు సంక్షిప్తంగా...‘భోగాపురం విమానాశ్రయ ప్రాజెక్టును జీఎంఆర్ కు అప్పగించేందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిబంధనలు తుంగలో తొక్కారు.

ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ (ఏఏఐ)కి ఇవ్వకూడదు..ప్రైవేట్ రంగ సంస్థ జీఎంఆర్ కే ఇవ్వాలి అనే దురుద్దేశంతో నిర్ణయం తీసుకున్నారు. ఇంత ధైర్యంగా...ఓపెన్ గా తాము అనుకున్నటువంటి చెడ్డ పని ఏదైనా కూడా..అవినీతి పని ఏదైనా కూడా చేయటానికి తెగించటం అనేది ఈ మధ్యకాలంలోనే చూస్తున్నాం. అడ్డగోలుగా చేయటం అనేది గతంలో ప్రభుత్వాలు చేసేవి కావు..ఇప్పుడు తెగించేశారు..బహిరంగంగా చేస్తున్నారు.’ ఇవి భోగాపురం ప్రాజెక్టుపై అజయ్ కల్లాం చేసిన విమర్శలు. ఆ వీడియోలో అజయ్ కల్లాం చెప్పిన మాటలు వందకు వంద శాతం వాస్తవం. కానీ ఇంత తీవ్ర విమర్శలు చేసిన ఆయన అదే ప్రాజెక్టును ...తాను విమర్శలు చేసిన కంపెనీకి అప్పగిస్తూ..అందులో ఆదా చేశామని ప్రభుత్వం చెప్పుకుంటుంటే మౌనంగా ఉండటం అన్నదే విచిత్రం.

అజయ్ కల్లాం జీఎంఆర్ పై గతంలో చేసిన కామెంట్స్ వీడియో

https://www.youtube.com/watch?v=I_oKcTXnsw0

Next Story
Share it