Telugu Gateway
Latest News

మాకు ఇప్పుడే విమానాలొద్దు

మాకు ఇప్పుడే విమానాలొద్దు
X

కేంద్ర పౌరవిమానయాన శాఖ చిక్కుల్లో పడబోతోందా?. మూడు కీలక రాష్ట్రాలు తమకు ఇప్పుడే విమాన సర్వీసులు వద్దని ప్రకటించటంతో ఆ శాఖ ఏమి చేయబోతుంది. రాష్ట్రాలతో కేంద్రం ఘర్షణకు దిగుతుందా? లేక తానే వెనక్కు తగ్గుతుందా?. మరికొద్ది గంటల్లో విమాన సర్వీసులు ప్రారంభం కావాల్సి ఉండగా..మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా తమకు కొంత సమయం కావాలని..రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద ఎత్తున పెరుగుతున్నందున విమానాలు ఇప్పుడే అనుమతించటం సరికాదని కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పటికే చాలా మంది ప్రయాణికులు టిక్కెట్లు బుక్ చేసుకుని ప్రయాణాలకు కూడా రెడీ అయిపోయారు. తమిళనాడు సీఎం పళనిస్వామి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇదే తరహా అభిప్రాయాలను వ్యక్తం చేసి ఉన్నారు. దీంతో పౌరవిమానయాన శాఖ ఏమి చేయబోతున్నది అన్నది అత్యంత కీలకంగా మారింది. దేశంలోని కరోనా కేసుల్లో సగానికి సగం మహారాష్ట్రలోనే ఉన్నాయి.

ఈ తరుణంలో ఆ రాష్ట్ర అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే కేంద్ర పౌరవిమానయాన శాఖ తరపున కేంద్రమే ఇఫ్పటికే అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసి..విమాన, విమానాశ్రయ సిబ్బందితోపాటు ప్రయాణికులకు రవాణా సౌకర్యాలు కల్పించేలా ఏర్పాటు చేయాల్సిందిగా కూడా కోరింది. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో వేచిచూడాల్సిందే. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అయితే విమాన ప్రయాణికులను క్వారంటైన్ కు పంపాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు అయితే తాము ఖచ్చితంగా 14 రోజుల క్వారంటైన్ చేస్తామని స్పష్టం చేస్తున్నాయి. ఇది కూడా వివాదస్పదం అవుతోంది.

Next Story
Share it