Telugu Gateway
Latest News

‘న్యూయార్క్ టైమ్స్’ సంచలనం

‘న్యూయార్క్ టైమ్స్’ సంచలనం
X

అమెరికాలోని అగ్రశ్రేణి పత్రికల్లో న్యూయార్స్ టైమ్స్ ఒకటి. ఆదివారం నాటి ఆ పత్రిక ఓ సంచలనానికి కేంద్రం అయింది. ‘అమెరికా మరణాలు లక్షకు చేరువలో, లెక్కకట్టలేనంత నష్టం’ అనే హెడ్డింగ్ తో ఫస్ట్ పేజీ నిండా మరణించిన వారి పేర్లతో నింపేసింది. ఒక్కఫోటో..ఒక్క వార్త ఏమీ లేకుండా కేవలం ఈ పేర్లతో నే ఫస్ట్ పేజీని నింపేసి న్యూయార్స్ టైమ్స్ సంచలనానికి కారణం అయింది. అగ్రరాజ్యం అమెరికాలో ఇతర దేశాలతో పోలిస్తే కరోనా బారిన పడి పెద్ద ఎత్తున ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే ఈ సంఖ్య లక్షకు చేరువ అయినా..అనధికార లెక్కల ప్రకారం ఇది మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. మొదటి నుంచి కూడా న్యూయార్క్ టైమ్స్ కరోనా విషయంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరును తూర్పారపడుతూ పలు పరిశోధనాత్మక కథనాలు ప్రచురించింది. వైట్ హౌస్ లోని కీలక బృందాలు చేసిన సూచనలను పెడచెవిన పెడుతూ ట్రంప్ వ్యవహరించటం వల్లే దేశంలో ఇంత పెద్ద నష్టం జరిగిందని పేర్కొంది.

కోవిడ్ 19 వెలుగు చూసిన వెంటనే అమెరికాకు దీని వల్ల కలిగే నష్టం ఎంత భయంకరంగా ఉంటుందో ట్రంప్ టీమ్ లోని కీలక సభ్యులు నివేదికలు ఇఛ్చినా కూడా తొలుత చైనాతో వాణిజ్య ఒప్పందానికే ఆయన ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని గత కథనాల్లో ప్రస్తావించింది. వుహాన్ లో పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూసిన తర్వాత కూడా ఆ దేశం నుంచి అమెరికాలోకి విమానాలను అనుమతించి ట్రంప్ సర్కారు పెద్ద తప్పుచేసిందని..ముఖ్యంగా న్యూయార్క్ లో పెద్ద ఎత్తున కేసులు వెలువడటానికి ఇదే కారణంగా న్యూయార్క్ టైమ్స్ కథనాలు వెల్లడించాయి. తాజాగా ఫస్ట్ పేజీ నిండా మృతుల పేర్లతో నింపి మరో సంచలనానికి కేంద్ర బిందువుగా నిలిచింది.

Next Story
Share it