Telugu Gateway
Latest News

ఫార్మా..హెల్త్ కేర్ ఓన్లీ సేఫ్

ఫార్మా..హెల్త్ కేర్ ఓన్లీ సేఫ్
X

కరోనా కారణంగా దేశంలో విధించిన లాక్ డౌన్ అన్ని రంగాలను చావు దెబ్బతీసింది. కాస్తో కూస్తో సురక్షితంగా ఉన్న రంగాలు ఏవైనా ఉన్నాయంటే అవి ఫార్మా, హెల్త్ కేర్ రంగాలు మాత్రమే. మిగిలిన అన్ని రంగాలకు చెందిన పరిశ్రమలు లాక్ డౌన్ కారణంగా తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. ఇవి కోలుకోవటానికి కూడా చాలా సమయం పడుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రాజెక్ట్స్ టుడే సంస్థ లాక్ డౌన్ కాలంలో ఆయా రంగాలపై పడిన ప్రభావాన్ని అధ్యయనం చేసింది. దీని కోసం వివిధ రంగాలకు చెందిన 233 మంది ప్రముఖుల అభిప్రాయాలను తీసుకుంది. అందులో ప్రమోటర్లతోపాటు కన్సల్టెంట్లు వివిధ విభాగాల వాళ్లు ఉన్నారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న అధికశాతం మంది వ్యక్తులు ఫార్మాస్యూటికల్స్, ఆరోగ్య సంరక్షణ రంగాలు తప్ప మిగిలిన అన్ని రంగాలూ ప్రస్తుత లాక్‌డౌన్ కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యాయని అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్ ఎత్తి వేసిన తరువాత ఈ యూనిట్లు తిరిగి కార్యకలాపాలు ప్రారంభం కావడానికి కొంత సమయం పడుతుందన్నారు.

దాదాపు 60 రోజులకుపైగా జరిగిన దేశవ్యాప్త లాక్‌డౌన్, మొత్తం ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది. ప్రతి రంగంలో ఇప్పుడు అనిశ్చితి రాజ్యమేలుతోంది. ఈ అధ్యయనం ప్రకారం, ప్రమోటర్లకు ప్రధాన అవరోధం ఆగిపోయిన ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించడమే. సహేతుకమైన వడ్డీతో తగినన్ని నిధులు పొందడం ఓ సమస్యకాగా, తమ సొంత గ్రామాలకు తరళి వెళ్లిన కార్మికుల తరహా నైపుణ్యం కలిగిన కార్మికులను కనుగొనడం మరో సవాల్‌గా నిలుస్తుంది. అలాగే అవసరమైన ముడి సరుకులు, మెషీనరీలను ప్రాజెక్ట్ సైట్ వద్ద తీసుకురావడం కూడా సమస్యగానే ఉంటుంది. దేశవ్యాప్త లాక్‌డౌన్ పూర్తిగా సరఫనా చైన్‌ను ఛిన్నాభిన్నం చేసింది. ఇది వ్యవస్థీకృతం కావడానికి కొంత సమయం పడుతుందని తేల్చారు.

Next Story
Share it