Telugu Gateway
Latest News

మూడు లక్షల కోట్ల పూచీకత్తు లేని రుణాలు

మూడు లక్షల కోట్ల పూచీకత్తు లేని రుణాలు
X

45 లక్షల యూనిట్లుకు ఊరట

రెరా ప్రాజెక్టులకు ఆరు నెలల పాటు వెసులుబాటు

కరోనా దెబ్బకు సంక్షోభంలో చిక్కుకుపోయిన 45 లక్షల సూక్ష్మ,చిన్న, మధ్యతరహా సంస్థలకు పెద్ద ఊరట. ఈ సంస్థలకు ఎలాంటి హామీ లేకుండా మూడు లక్షల కోట్ల రూపాయల రుణాలు అందించనున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ స్కీమ్ 2020 అక్టోబర్ 31 వరకూ అమల్లో ఉంటుందని తెలిపారు. దీంతో తక్షణమే ఈ యూనిట్లు అన్నీ రుణాలు తీసుకుని తమ కార్యకలాపాలు ప్రారంభించటంతో ఈ రంగంలోని ఉద్యోగాలను రక్షించే ఛాన్స్ ఉంటుందని తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ఆర్ధిక ప్యాకేజీలో భాగంగా పలు అంశాలను మంత్రి బుధవారం నాడు మీడియాకు తెలిపారు. రోజు వారీగా ఆయా రంగాలకు సంబంధించి కల్పించిన వెసులుబాట్లను మంత్రి వెల్లడించనున్నారు. 12 నెలల మారిటోరియంతో ఎంఎస్‌ఎంఈలకు రుణాలు ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. రుణాల చెల్లింపునకు నాలుగేళ్ల కాలపరిమితి ఉంటుందని పేర్కొన్నారు. దీంతో పాటు సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ.50 వేల కోట్లతో ప్రత్యేక ఈక్విటీ నిధికి రూపకల్పన చేశామని, కార్యకలాపాలు విస్తరించి మెరుగైన అవకాశాలు అందుకునేందుకు అవకాశం ఉన్న పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడమే ఈక్విటీ నిధి ఉద్దేశమని తెలిపారు.

నేటి నుంచి ఒక్కొక్కటిగా ఆర్థిక ప్యాకేజీలు ప్రకటిస్తామని ఆమె వెల్లడించారు. కరోనా కారణంగా తీవ్ర సమస్యల్లో చిక్కుకున్న రియల్ ఎస్టేట్ రంగానికి నేరుగా ఎలాంటి ఆర్ధిక రాయితీలు..ప్రోత్సాహకాలు ప్రకటించలేదు. కాకపోతే రెరా కింద 2020 మార్చి 25లోపు నమోదు అయిన అన్ని ప్రాజెక్టులకు ఎలాంటి దరఖాస్తు లేకుండా ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఆరు నెలల గడుడు పొడిగిస్తున్నట్లు తెలిపారు. నూతన మార్గదర్శకాల ప్రకారం కొత్త ప్రాజెక్టు సర్టిఫికెట్లు అందజేస్తారన్నారు. దీంతోపాటు టీడీఎస్ (టాక్స్ డిడక్షన్ స్కీమ్) పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. 2020-21లో టీడీఎస్‌లో 25 శాతం మినహాయింపునిచ్చింది. దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకూ జీతం ఉన్న వారికి 5 శాతం టీడీఎస్ ఉంది. అలాగే 5లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకూ జీతం ఉన్న ఉద్యోగులకు 20 శాతం వరకూ టీడీఎస్ ఉంది. సంవత్సరానికి పది లక్షల రూపాయలకు మించి జీతం ఉన్న వారికి 30 శాతం టీడీఎస్ ఉంది. ఈ తరుణంలో 2020-21లో టీడీఎస్‌లో 25 శాతం మినహాయింపునిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. టీడీఎస్‌, టీసీఎస్‌ రేటు తగ్గింపుతో పన్ను చెల్లించేవారికి రూ.50 వేల కోట్ల వరకు ప్రయోజనం చేకూరనుంది. మరోవైపు మరోవైపు 2019-20 ఐటీ దాఖలుకు గడువును కేంద్రం నవంబర్‌ 30 వరకు పొడిగించింది. దేశీయ కంపెనీలను ప్రోత్సహించేందుకు వీలుగా 200 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు గ్లోబల్ టెండర్లు పిలవాల్సిన అవసరం లేదని తేల్చేశారు.

దీంతో దేశీయ కంపెనీలో పోటీ పడి ఈ ప్రాజెక్టులను దక్కించుకునే వెసులుబాటు దక్కనుంది. అంతే కాకుండా ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన డిస్కమ్ లకు లిక్విడిటీ కల్పించేలా 90 వేల కోట్ల రూపాయలు అందజేయనున్నారు. జెన్ కోలకు డిస్కమ్ లు పడ్డ బకాయిలు చెల్లించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వాల గ్యారంటీ మేరకు పీఎఫ్ సీ, ఆర్ఈసీ సంస్థలు ఈ 90 వేల కోట్ల రూపాయల మేర నిధులు వ్యవస్థలోకి జొప్పించనున్నాయి. రైల్వేలు, రోడ్డు, ఉపరితల రవాణా, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ శాఖల కాంట్రాక్టర్లకు ఎలాంటి జరిమానాలు లేకుండా ప్రాజెక్టుల పూర్తికి ఆరు నెలల గడువు ఇవ్వనున్నారు. కొంత మేర అయినా పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు ఆర్ధిక వెసులుబాటు కల్పించేలా బ్యాంకు గ్యారంటీలను విడుదల చేయనున్నారు.

Next Story
Share it