Telugu Gateway
Latest News

‘లాక్’ కొనసాగింపు...జూన్ 30 వరకూ

‘లాక్’ కొనసాగింపు...జూన్ 30 వరకూ
X

జూన్ 8 నుంచి మాల్స్, రెస్టారెంట్లు, దేవాలయాలకు అనుమతి

అంతరాష్ట్ర రవాణాకు రైట్..రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి

బార్లు..పార్కులు..జిమ్ లకు నో

తాళం ఇంకా తీయలేదు. కాకపోతే కిటీకీలు మాత్రం చాలా పెట్టారు. లాక్ మాత్రం అలా ఉంచుతున్నారు. పరిమిత ఆంక్షల మధ్య దేశంలో లాక్ డౌన్ జూన్ 30 వరకూ పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అందరూ జూన్ 15 వరకూ మాత్రమే లాక్ డౌన్ ఉంటుందని భావించారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా జూన్ నెలాఖరు వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి మరిన్ని మినహాయింపులు అందుబాటులోకి రానున్నాయి. ప్రధానంగా లాక్ డౌన్ కంటైన్ మెంట్ జోన్లలోనే అమలు కానుంది. జూన్ 8 నుంచి దేశంలోని అన్ని దేవాలయాలు తెరవనున్నారు. దీంతోపాటు హోటళ్ళు, రెస్టారెంట్లు, ఆతిథ్య సేవలు, షాపింగ్ మాల్స్ కు కూడా కేంద్రం అనుమతులు ఇఛ్చింది. అయితే అన్ని చోట్లా కూడ కరోనా నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ప్రజారవాణాకు సంబంధించి అత్యంత కీలకమైన మెట్రో రైళ్ళు, అంతర్జాతీయ విమానాల సర్వీసులకు అనుమతి లేదు.

సినిమా హాళ్ళు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు, బార్లు, రాజకీయ, సామాజిక, క్రీడా సంబంధిత అంశాలపై నిషేధం కొనసాగనుంది. పాఠశాలలు ఎప్పటి నుంచి తెరవాలనే అంశంపై తర్వాత నిర్ణయం తీసుకకుంటారు. అన్ని రాష్ట్రాలతో సంప్రదించి అప్పటి పరిస్థితులను దీనిపై నిర్ణయం వెలువరించనున్నారు. తాజా మినహాయింపుల్లో అత్యంత కీలకమైనది అంతరాష్ట్ర రవాణా. ఈ రవాణాపై ఆంక్షలను తొలగించారు. అయితే దీనికి ఆయా రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి. రాత్రి వేళల్లో కర్ఫ్యూ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కొనసాగుతుందని పేర్కొంది.

Next Story
Share it