Telugu Gateway
Latest News

విదేశాల్లో చిక్కుకుపోయిన వారికి ఊరట

విదేశాల్లో చిక్కుకుపోయిన వారికి ఊరట
X

విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. ప్రత్యేక విమానాలు, ఓడల ద్వారా వీరిని దశల వారీగా వెనక్కి తీసుకురానున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే పూర్తి అయింది. మే7 నుంచి తొలి దశ తరలింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. భారతీయ ఎంబసీలు,హై కమిషన్స్ సంయుక్తంగా ఎక్కడెక్కడ ఎంత మంది భారతీయులు చిక్కుకుపోయారనే అంశంపై ఓ జాబితాను సిద్ధం చేశాయి. విదేశాల్లో చిక్కుకుపోయిన వారు భారత దేశం రావాలంటే అందుకు వారు టిక్కెట్ ధరను ఎయిర్ లైన్స్ కు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వీరి కోసం నాన్ షెడ్యూల్డ్ విమానాలను ఏర్పాటు చేయనున్నారు. ఎలాంటి కరోనా లక్షణాలు లేని వారిని మాత్రమే నిర్దేశిత పరీక్షల తర్వాత ప్రయాణానికి అనుమతిస్తారు. ప్రయాణ సమయంలో అందరూ ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రోటోకాల్స్ ను విధిగా పాటించాల్సి ఉంటుంది.

ఇలా వెనక్కి వచ్చిన వారు విధిగా ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే కాదు ప్రతి ఒక్కరినీ 14 రోజుల క్యారంటైన్ కు పంపనున్నారు. దీనికి కూడా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అది ఆస్పత్రిలో కావొచ్చు..లేదా సంస్థాగతంగా ఏర్పాటు చేసిన వసతి..రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చినవి ఏవైనా కావొచ్చు అని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని విదేశీ వ్యవహారాలు, పౌరవిమానయాన శాఖల వెబ్ సైట్ల ద్వారా తెలియజేయనున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇలా వెనక్కి వచ్చే భారతీయుల కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షలు తదితర అంశాల కోసం ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.

Next Story
Share it