Telugu Gateway
Latest News

ఆర్ధిక వ్యవస్థకు తీవ్రమైన సవాళ్లు

ఆర్ధిక వ్యవస్థకు తీవ్రమైన సవాళ్లు
X

రెపో..రివర్స్ రెపో రేట్లు తగ్గించిన ఆర్ బిఐ

కరోనా దెబ్బకు దేశ ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. రాబోయే రోజుల్లో ఆర్ధిక వ్యవస్థకు తీవ్రమైన సవాళ్ళు ఎదురు అవుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ద్రవ్యోల్బణ పరిస్థితులను కూడా ఇప్పటికిప్పుడు అంచనా వేయలేమన్నారు. శుక్రవారం నాడు మీడియా ముందుకు వచ్చిన గవర్నర్ మరోసారి వడ్డీ రేట్ల తగ్గింపును ప్రకటించారు. వడ్డీరేట్లు 40 బేసిస్ పాయింట్లను తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక వృద్ధి రేటు పెంచేవిధంగా ఆర్‌బీఐ చర్యలు తీసుకుంది. రెపోరేటు 4.40 నుంచి 4 శాతానికి తగ్గించింది. రివర్స్ రెపోరేటు 3.35 శాతానికి తగ్గించింది. ‘భారత విదేశీ మారక నిల్వలు 487 బిలియన్ యూఎస్ డాలర్లు ఉన్నాయి. మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 17 శాతం తగ్గింది. మార్చి, ఏప్రిల్‌లో సిమెంట్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది.

ముడి పదార్థాల ఇన్‌పుట్ ఖర్చు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆహారధాన్యాల ఉత్పత్తి పెరుగుతోంది. తక్కువ ధరలో రుణాలు, వడ్డీరేట్లు తగ్గడంతో సామాన్యుడికి ఊరట లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. పెట్టుబడులపై తీవ్ర పరిణామం చూపిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని పూర్తిగా కట్టడి చేస్తాం. 13 నుంచి 32 శాతం మేర ప్రపంచ వాణిజ్యం తగ్గింది. నాలుగు కేటగిరిలుగా ఎగుమతులు, దిగుమతులు పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. వర్కింగ్ కేపిటల్ పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు మారటోరియం పొడిగింపు ఉంటుంది. టర్మ్‌ లోన్లకు వర్తించేలా మారటోరియం పొడిగింపు ఉంటుంది’ అని శక్తికాంత్ దాస్ వెల్లడించారు.

Next Story
Share it