Telugu Gateway
Latest News

భారత్ లో గగనయానం షురూ

భారత్ లో గగనయానం షురూ
X

దేశీయ విమానాలు టేకాఫ్ అయ్యాయి. ఇక మిగిలింది అంతర్జాతీయ విమాన సర్వీసులే. అవి కూడా జూన్ నెలాఖరులోనే...లేక జూలైలోనే ప్రారంభం కాబోతున్నాయి. కాకపోతే ఆయా దేశాల్లో ఉంటే కరోనా కేసుల తీవ్రత తదితర అంశాల ఆధారంగా ఈ సర్వీసుల ప్రారంభం ఉంటుంది. రెండు నెలల విరామం తర్వాత దేశంలోని పలు విమానాశ్రయాల నుంచి సోమవారం నాడు విమానాలు గాల్లోకి లేచాయి. అయితే విమాన ప్రయాణికుల క్వారంటైన్ విషయంలో నెలకొన్న గందరగోళాలు..ఒక్కో రాష్ట్రం ఒక్కో రకమైన ప్రకటనలు చేయటంతో తొలి రోజు ప్రయాణికులు పెద్దగా ఆసక్తి చూపించినట్లు కన్పించటం లేదు. ఈ కారణంగా పలు సర్వీసులు కూడా రద్దు అయినట్లు చెబుతున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే దేశీయ విమాన సర్వీసుల స్థిరీకరణకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. విమాన సర్వీసులపై ఆంక్షల తర్వాత దేశంలో తొలి విమానం మాత్రం ఢిల్లీ విమానాశ్రయం నుంచి సోమవారం ఉదయం 4.45 గంటలకు పూణేకు బయలుదేరి వెళ్లింది. ఇదే లాక్ డౌన్ తర్వాత బయలుదేరిన తొలి ప్యాసింజర్ ప్లైట్.

ముంబయ్ విమానాశ్రయం నుంచి తొలి విమానం 6.45 గంటలకు పాట్నాకు బయలుదేరి వెళ్లింది. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలు అయిన ముంబయ్, చెన్నయ్, కలకత్తా విమానాశ్రయాల్లో ప్రయాణికుల విమానాలను అనుమతించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తొలుత ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. కేంద్ర జోక్యంతో ముంబయ్, చెన్నయ్ ల్లో కేవలం నామమాత్రంగానే సర్వీసులు నడిపారు. కోల్ కతా లో మాత్రం మే 28 తర్వాతే సర్వీసులకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఏపీలో కూడా మంగళవారం నుంచే విమాన సర్వీసులకు అనుమతి ఇస్తామని ప్రకటించింది. ఎన్నో ఉత్కంఠతల మధ్య విమాన సర్వీసులు సోమవారం నాడు ప్రారంభం అయ్యాయి.

Next Story
Share it