Telugu Gateway
Latest News

విమానయాన రంగం రికవరీకి ‘రెండేళ్ళు’!

విమానయాన రంగం రికవరీకి ‘రెండేళ్ళు’!
X

లాక్ డౌన్. కరోనా వైరస్ లు వల్ల ఈ ఆర్ధిక సంవత్సరంలో దేశీయ విమానయాన రంగం ఏకంగా 24 వేల నుంచి 25 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోనుంది. ప్రయాణ ఆంక్షలు పెరిగే కొద్దీ ఈ నష్టాలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. అంతే కాదు కరోనా కు మందు ఉన్న పరిస్థితులకు విమానయాన రంగం చేరుకోవాలంటే కనీసం 18 నుంచి 24 నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. దేశంలో అత్యంత రద్దీ ఉండే విమానాశ్రయాలైన ముంబయ్, ఢిల్లీ, చెన్నయ్, కోల్ కతాల్లో ఆంక్షలు మరింత కాలం కొనసాగితే పరిస్థితి మరింత క్షీణిస్తుందని ప్రముఖ సంస్థ ‘క్రిసిల్ ’ తన తాజా నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా ఈ ఏడాది ఎయిర్ లైన్స్ ఏకంగా 17000 కోట్ల రూపాయల మేర నష్టపోతాయని పేర్కొన్నారు.

దీంతోపాటు ఎయిర్ పోర్ట్ ఆపరేటర్స్ 5000 నుంచి 5500 కోట్ల రూపాయలు, ఎయిర్ రిటైలర్స్ 1700 నుంచి 1800 కోట్ల రూపాయలు నష్టపోతాయని క్రిసిల్ నివేదికలో పేర్కొన్నారు. ఇవన్నీ కలిపి గత కొన్ని సంవత్సరాలుగా మంచి వృద్ధి రేటు సాధిస్తున్న విమానయాన రంగాన్ని వెనక్కి నెడతాయని పేర్కొన్నారు. ఈ ఆదాయ నష్టాలకు సంబంధించిన లెక్కలు అన్నీ ప్రాథమిక అంచనాలే అని తెలిపారు. విమానాశ్రయాల్లో కార్యకలాపాలు ప్రారంభించినా మొత్తం నిర్వహణ సామర్ధ్యం 50 నుంచి 60 శాతం మధ్యలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో విమానయాన రంగంలో ఎన్నో మార్పులకు అవకాశం ఉందని తెలిపారు.

Next Story
Share it