Telugu Gateway
Latest News

కరోనాపై పోరుకు 1125 కోట్లు కేటాయించిన అజీమ్ ప్రేమ్ జీ

కరోనాపై పోరుకు 1125 కోట్లు కేటాయించిన అజీమ్ ప్రేమ్ జీ
X

అజీమ్ ప్రేమ్ జీ. దాతృత్వంలో ముందుంటారు. కరోనా విషయంలో కూడా ఆయన అలాగే చేశారు. ఏకంగా ఈ వైరస్ పై పోరుకు తమ సంస్థ 1125 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు ప్రకటించారు. మహమ్మారిపై పోరాడేందుకు విప్రో లిమిటెట్‌, విప్రో ఎంటర్‌ప్రైజెస్‌లతో కలిసి రూ. 1125 కోట్లు వ్యయం చేయనుంది. ఈ మేరకు మూడు సంస్థలు కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేటాయించిన ఈ భారీ మొత్తం తాము చేపట్టే సామాజిక కార్యక్రమాల కోసం (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ) ఖర్చుపెట్టే నిధులకు అదనం అని వెల్లడించింది.

అంటువ్యాధి ప్రబలకుండా తమ ప్రాణాలు పణంగా పెట్టి సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి అండగా ఉంటామని ఈ సందర్భంగా పేర్కొంది. 1125 కోట్ల రూపాయల్లో ఎక్కువ మొత్తం అజీమ్‌ ఫౌండేషన్‌ నుంచే సమీకరించినట్లు సమాచారం. విప్రో లిమిటెడ్‌ రూ. 100 కోట్లు, విప్రో ఎంటర్‌ప్రైజెస్‌ రూ. 25 కోట్లు అందించగా.. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ రూ. 1000 కోట్లు కరోనాపై పోరుకు కేటాయించింది. ఇక విప్రో కంపెనీల వ్యవస్థాపకుడు, ఐటీ దిగ్గజం అజీమ్ ప్రేమ్‌జీ 2019 మార్చిలో సామాజిక సేవ నిమిత్తం తన సంపదలో 52,750 కోట్ల రూపాయలు(ఆయన షేర్లలో 34 శాతానికి సమానం) వెచ్చించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Next Story
Share it