Telugu Gateway
Latest News

వాట్సప్ కొత్త ఫీచర్ ...ఒకేసారి 8 మందితో వీడియో కాల్ సౌకర్యం

వాట్సప్ కొత్త ఫీచర్ ...ఒకేసారి 8 మందితో వీడియో కాల్ సౌకర్యం
X

అందరూ ఇళ్ళల్లోనే. కరోనా దెబ్బకు ఎవరూ కాలు బయట పెట్టే పరిస్థితి లేదు. అందుకే గతంలో ఎప్పుడూ పెద్దగా ఫోన్లు చేసి మాట్లాడుకోని వారు కూడా కాంటాక్ట్ లిస్టు చూసుకుని మరీ పలకరించుకుంటున్నారు. నిత్యం ఒకరికొరు క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు. వాయిస్ కాల్స్ ఓకే. వీడియో కాల్ అయితే ప్రత్యేక్షంగా చూస్తూ కూడా మాట్లాడుకోవచ్చు కదా. అందుకే దీనికి ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం వాట్సప్ లో కేవలం నలుగురు మాత్రమే గ్రూపు వీడియో కాల్ మాట్లాడుకునే వెసులుబాటు ఉంది. కానీ ఇప్పుడు వాట్సప్ ఈ సౌకర్యాన్ని ఎనిమిదికి పెంచింది. అంటే ఎనిమిది మంది ఒకేసారి వీడియో కాలింగ్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు అన్న మాట. ఈ కరోనా సంక్షోభ సమయంలో వాట్సప్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ ఫోన్ యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. పెరిగిన ఈ పరిమితి ఆండ్రాయిడ్ వాట్సాప్ వీ2.20.133 బీటా, ఐఫోన్ వాట్సప్ వెర్షన్ 2.20.50.25 బీటాలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది.

రెండు ప్లాట్‌ఫామ్‌ల్లోని బీటా వినియోగదారులకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనికోసం అయితే యూజర్లు సరికొత్త బీటా వెర్షన్‌ కలిగి ఉండాలని వాట్సాప్ ఫీచర్స్ ట్రాకర్ వెల్లడించింది. వాట్సాప్‌లో గ్రూప్ కాల్ చేయడానికి కుడి ఎగువన ఉన్న కాల్ బటన్ పై క్లిక్ చేయాలి. కాల్ అనంతరం యూజర్లను యాడ్ చేసుకుంటూ పోవాలి. గ్రూప్ కి సంబంధించి అయితే ఎనిమిది మందికి ఒకేసారి కాల్ చేసుకోవచ్చు. ఒకవేళ గ్రూపులో ఎనిమిదికంటే ఎక్కువ మంది ఉంటే.. అపుడు ఎవరికి కాల్ చేయాలనుకుంటున్నారో వాట్సాప్ అడుగుతుంది. అలాగే కాంటాక్ట్ లో సేవ్ చేయని వారిని గ్రూపు కాల్ లోకి ఆహ్వానించలేమని స్పష్టం చేసింది.

Next Story
Share it