Telugu Gateway
Latest News

అమెరికాలోని భారతీయ ఐటి నిపుణులకు బిగ్ రిలీఫ్

అమెరికాలోని భారతీయ ఐటి నిపుణులకు బిగ్ రిలీఫ్
X

హెచ్ 1 బీ వీసాల పొడిగింపునకు ఓకే

భారతీయ ఐటి నిపుణులకు పెద్ద ఊరట. గడువు ముగిసినా కూడా హెచ్ 1 బీ వీసాదారులు మరికొన్ని రోజులు అమెరికాలో ఉండేందుకు అనుమతి లభించింది. కరోనా కల్లోలం నేపథ్యంలో ఈ ప్రత్యేక మినహాయింపులు ఇచ్చారు. అమెరికా నుంచి పలు దేశాలకు ఎయిర్ లైన్స్ లేకపోవటంతో దేశంలో కరోనా మహమ్మారి పెద్ద ఎత్తున ఉండటంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్ 1బీ వీసా పొడిగింపుపై వచ్చిన అభ్యర్థనలను పరిశీలిస్తామని అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. ఈ మేరకు అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సిఐఎస్) సోమవారం తన వెబ్‌సైట్‌లో ఒక నోటిఫికేషన్ పోస్ట్ చేసింది. కరోనా విస్తరణ నేపథ్యంలో వీసాల గడువు పొడిగింపు నిర్ణయాన్ని చాలా వేగంగా పరిష్కరిస్తామని తెలిపింది. అలాగే ప్రతీ దరఖాస్తును పరిశీలించి ప్రాసెస్ చేస్తామని తెలిపింది. ఈ నిర్ణయంతో అక్కడ చిక్కుకున్న భారతీయులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. అయితే గడువు పొడిగింపునకు సంబంధించి విశ్వసనీయమైన సాక్ష్యాలను దరఖాస్తు దారుడు సమర్పించాలని నోటిఫికేషన్ తెలిపింది.

వీసాల గడువు ముగిసి అమెరికాలో చిక్కుకున్న భారతీయ పౌరులకు ఈ నిర్ణయం భారీ ఊరట నిస్తుందని సంబంధిత అధికారి ఒకరు పేర్కొన్నారు. కరోనా సంక్షోభం కారణంగా అక్కడ చిక్కుకున్న భారతీయ పౌరులకు హెచ్-1 బీ సహా, వివిధ రకాల వీసాల చెల్లుబాటును పొడిగించాలని గత వారం అమెరికాకు భారత ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో వలసదారులు వీసా గడువు ముగిసిన తరువాత అమెరికాలో ఉండేందుకు గడువు పొడిగింపు (ఈవోఎస్) లేదా స్టేటస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా బహిష్కరణ వంటి ఇతర సమస్యల నుంచి గట్టెక్కవచ్చు. హెచ్-1 బీ వీసా దారులు ఒకవేళ ఉద్యోగాలు కోల్పోయినట్లు అయితే అమెరికాలో ఉండే గడువును 60 రోజుల నుంచి 8 నెలలు వరకు పొడిగించినట్టు తెలిపింది.

Next Story
Share it