Telugu Gateway
Latest News

కరోనా నుంచి కోలుకున్నారు..కానీ ఆ డాక్టర్ల రంగు మారింది

కరోనా నుంచి కోలుకున్నారు..కానీ ఆ డాక్టర్ల రంగు మారింది
X

వుహాన్. ఈ పేరు చెపితే ఎవరికైనా ఆ నగర అందచందాల కంటే కరోనా వైరసే గుర్తొస్తోంది. ఎందుకంటే అది అంతలా ప్రపంచాన్ని భయపెట్టింది. తాజాగా అక్కడ వెలుగు చూసిన వార్త ఒకటి మరింత కలకలం రేపుతోంది. చైనాలోని డాక్టర్లు రాత్రింబవళ్ళు కష్టపడి లక్షలాది మంది కరోనా వైరస్ బాధితుల ప్రాణాలు కాపాడారు. అందులో డాక్టర్ల శ్రమను ఎవరూ తక్కువ చేయటం లేదు. ప్రపంచం అంతా ఇప్పుడు డాక్టర్లకు చేతులెత్తి నమస్కరిస్తోంది. కరోనా వైరస్ బాధితులకు వైద్యం అందించే క్రమంలో కొంత మంది డాక్టర్లు కూడా కరోనా బారిన పడ్డారు. వుహాన్ లోనూ అదే జరిగింది. కరోనా పేషంట్లకు వైద్యం చేస్తూ ఇద్దరు డాక్టర్లు వైరస్ బారిన పడ్డారు. అయితే వాళ్లు భయంకరమైన కరోనా నుంచి బయటపడ్డారు కానీ..వాళ్ళ శరీరం పూర్తిగా నల్లగా మారిపోయింది. ఇది ఇప్పుడు అక్కడ కలకలం రేపుతోంది. వాళ్ళను ఆస్పత్రిలో చేర్చి వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ వై ఫాన్, డాక్టర్ హు వెఫెంగ్ ఇద్దరి వయస్సు 42 సంవత్సరాలే. వీళ్ళిద్దరూ వుహాన్ సెంట్రల్ ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. వీరిద్దరి కాలేయం దెబ్బతినటం వల్లే ఇద్దరి డాక్టర్ల శరీరం రంగు మారినట్లు గుర్తించినట్లు చైనా మీడియా వెల్లడించింది.

అయితే శరీరం రంగు మారటానికి వాళ్లు వాడిన ఒక డ్రగ్ కారణమై ఉంటుందని ఓ డాక్టర్ అంచనా వేశారు. వారిద్దరి కాలేయం మెరుగుపడితే వారి శరీర రంగులో కూడా మార్పు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఒక్క చైనాలోనే కాదు..కరోనాపై పోరు క్రమంలో పలు దేశాల్లో డాక్టర్లు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. దీనికి ఏ దేశం మినహాయింపు కాదన్న రీతిలో ఉంది వ్యవహారం. అగ్రరాజ్యం అమెరికాలోనూ పలువురు డాక్టర్లు కరోనా బారిన పడ్డారు. పలు చోట్ల డాక్టర్ల మరణాలు కూడా నమోదు అయ్యాయి. మొత్తానికి కరోనా వ్యవహారం అటు ప్రజలనే కాకుండా డాక్టర్లను కూడా భయపెడుతోంది.

Next Story
Share it