Telugu Gateway
Latest News

తెలుగు మీడియాలో ‘కోతల కాలం’ మొదలైంది!

తెలుగు మీడియాలో ‘కోతల కాలం’ మొదలైంది!
X

రానున్నది అత్యంత గడ్డుకాలమే!

పేజీల్లో కోత. వేతనాల్లో కోత. వందల సంఖ్యలో ఉద్యోగాల్లో కోత. ఎటుచూసినా ఇప్పుడు మీడియాలో ‘కోతల కాలమే’ కన్పిస్తోంది. కరోనా వైరస్ ప్రభావం తెలుగు మీడియాతోపాటు జాతీయ మీడియాను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కరోనాకు ముందు ఏ పత్రికను చేతిలోకి తీసుకున్నా చేతికి ఆనేది. ఇప్పుడు నాలుగు పత్రికలు కలిపి పట్టుకున్నా చేతికి ఆనటం లేదు. ఎందుకంటే ఆ స్థాయిలో పేజీల్లో కోత పడింది. ఆ కోతలు ఇఫ్పట్లో ఆగేలా కన్పించటం లేదు. కనీసం అంటే ఓ ఆరు నెలల పాటు ప్రధాన పత్రికలు అన్నీ జిల్లా పేజీలు అంటే ట్యాబ్లాయిడ్స్ ను పునరుద్ధరించే ఛాన్స్ లేదని చెబుతున్నారు. అప్పటికి కరోనా ప్రభావం పూర్తిగా తొలగిపోయి ప్రకటనలు ఊపందుకుంటే తప్ప..వాటిని పునరుద్ధరించే ఆలోచన లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు మీడియా సంస్థలు అన్నీ ఓ అంగీకారానికి వస్తున్నాయని సమాచారం. ట్యాబ్లాయిడ్స్ ను పూర్తి స్థాయిలో తొలగించి..వాటిని కూడా మెయిన్ పేజీల్లోనే బ్రాడ్ షీట్ లో తెస్తుండటంతో ఈ విభాగం ప్రింటింగ్ సెక్షన్ తోపాటు సబ్ ఎడిటర్లు, రిపోర్టర్ల ఉద్యోగాల్లో భారీగా కోత పడే అవకాశం ఉందని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ ఉద్యోగాల కోత అన్ని పత్రికల్లో కలుపుకుని వందల సంఖ్యలో ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ప్రభావం బారిన పడే వాళ్లలో కంట్రిబ్యూటర్లు కూడా ఉంటారు. వీళ్లను కూడా కలుపుకుంటే ఉపాధి కోల్పోయే వారి సంఖ్య వేలల్లో ఉండబోతుంది.

కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడి పత్రికలకు వచ్చే ప్రకటనలు దారుణంగా పడిపోవటంతో ఇప్పటికే అన్ని ప్రధాన పత్రికలు పేజీలను తగ్గించాయి. కొన్ని రోజులు పత్రిక సరఫరా కూడా ఆగిపోయి ఇబ్బందులు పడ్డారు. ఏప్రిల్ 1 నుంచి పత్రికల పంపిణీ వ్యవస్థ కొంత మెరుగుపడినా యాజమాన్యాలు మాత్రం తమ కొత్త ప్రణాళికలుఅమలుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. అన్ని పత్రికల్లోనూ ప్రత్యేక పేజీల్లో భారీగా కోతలు పడ్డాయి. కరోనా కారణంగా మీడియా రంగం గతంలో ఎన్నడూలోని రీతిలో సంక్షోభాన్ని ఎదుర్కోబోతోంది. ఆ ప్రభావం ఈ రంగంలో పనిచేసే ఉద్యోగులపై కూడా భారీగానే పడనుంది. ఈ నెలాఖరు నాటికి ఏ పత్రిక ఎంత మేర ఉద్యోగుల్లో కోత పెట్టనుందనే విషయాలు తేలనున్నాయని చెబుతున్నారు.

Next Story
Share it