Telugu Gateway
Latest News

మీడియాలో వేతనాల కోత..కేంద్రానికి సుప్రీం నోటీసులు

మీడియాలో వేతనాల కోత..కేంద్రానికి సుప్రీం నోటీసులు
X

కరోనా వైరస్ మీడియాను దారుణంగా దెబ్బతీసింది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే పలు మీడియా సంస్థలు వేతనాల్లో పెద్ద ఎత్తున కోతలు పెట్టగా..ఉద్యోగాలు తొలగింపు కూడా సాగుతూ పోతోంది. ఎప్పుడు ఎవరిపై వేటు పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఓ వైపు కరోనా టెన్షన్ ..మరో వైపు ఉద్యోగాల టెన్షన్. రెండూ కలసి మీడియా ఉద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా అగ్రశ్రేణి మీడియా సంస్థలు మొదలుకుని..మధ్య, చిన్న తరహా పత్రికలు కూడా పెద్ద ఎత్తున ఉధ్యోగులను తొలగించటంతోపాటు వేతనాల్లో కూడా కోతలు పెట్టాయి. తెలుగు మీడియాలోనూ ఇదే ప్రారంభం అయింది. ఇఫ్పుడు ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంతోపాటు ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ, న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ కు నోటీసులు ఇచ్చింది. జస్టిస్ ఎన్ వి రమణ, ఎస్ కె కౌల్, బి ఆర్ గవాయిలతో కూడిన బెంచ్ మీడియాలో వేతనాల కోత, ఉద్యోగాల తొలగింపులపై దాఖలైన పిటీషన్ ను విచారించింది.

ఈ అంశంపై నేషనల్ అలయన్స్ ఆఫ్ జర్నలిస్ట్స్, ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్, బృహన్ ముంబయ్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ లు ఈ పిటీషన్ దాఖలు చేశాయి. జర్నలిస్టులకు సంబంధించి చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయని..దీనిపై విచారణ జరపాలని కోర్టును కోరారు. దీనిపై స్పందించిన కోర్టు ఇతర యూనియన్లు కూడా ఇదే అంశం ప్రస్తావిస్తున్నాయని..వ్యాపారం ప్రారంభం కాకపోతే..ఎంత కాలం ప్రజలు నిలబడగలరు? అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోడీ పదే పదే లాక్ డౌన్ సమయంలో ఎవరి ఉద్యోగాలు తొలగించొద్దని..వేతనాల్లో కోత పెట్టొద్దని కోరినా కూడా పలు మీడియా సంస్థలు అమానవీయంగా, అక్రమంగా వ్యవహరిస్తున్నాయని పిటీషన్ లో పేర్కొన్నారు.

ఈ లాక్ డౌన్ సమయంలో అసలు బయటకు వెళ్లటం..కొత్త ఉద్యోగాలు వెతుక్కోవటం అనేది సాధ్యం కాని పని అని పేర్కొన్నారు. ఈ పిటీషన్ లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో వేతనాల కోత, న్యూస్ నేషన్ లో16 మంది ఉద్యోగుల తొలగింపు, టైమ్స్ ఆఫ్ ఇండియా సండే మ్యాగజైన్ లో టీమ్ మొత్తాన్ని తొలగించటం, క్వింట్ సంస్థ 45 మంది ఉద్యోగులను వేతనం లేని సెలవుపై వెళ్ళాల్సిందిగా ఆదేశించటం వంటి అంశాలను ప్రస్తావించారు. మీడియా సంస్థలు ఇలా వ్యవహరించటం జర్నలిస్టులు ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నారని పేర్కొన్నారు. విశేషం ఏమిటంటే ఈ పిటీషన్ పై మీడియా సంస్థలు ఏవీ కూడా కవరేజ్ రాకుండా చూసుకున్నాయి. ప్రధానంగా వెబ్ మీడియాలోనే ఈ వార్తలు ఎక్కువగా వచ్చాయి సోమవారమే ఈ కేసు విచారణకు వచ్చింది.

Next Story
Share it