Telugu Gateway
Latest News

విదేశాల్లో చిక్కుకుపోయిన వారి కోసం ప్రత్యేక ప్లాన్!

విదేశాల్లో చిక్కుకుపోయిన వారి కోసం ప్రత్యేక ప్లాన్!
X

లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. అయితే ఇలా స్వదేశానికి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ ఎవరి టిక్కెట్ ఖర్చును వారే భరించాల్సి ఉంటుంది. అయితే వీళ్లందరినీ ప్రత్యేక విమానాల్లో తీసుకురావాలా?. లేక రెగ్యులర్ సర్వీసులు ప్రారంభం అయ్యాకే వెనక్కి తీసుకురావాలా?. తీసుకొచ్చిన తర్వాత మళ్లీ వీరిని ఎలా ‘ప్రత్యేక క్వారంటైన్’ కేంద్రాల్లో పెట్టాలి? అది ఎన్ని రోజులు. ఇలాంటి అంశాలపై ప్రస్తుతం కసరత్తు సాగుతోంది. విదేశాంగ శాఖ, పౌరవిమానయాన శాఖతోపాటు మరికొన్ని విభాగాలు పలు దేశాల్లో ఉన్న భారతీయులు తీసుకొచ్చేందుకు ఓ ప్రణాళిక రూపొందిస్తున్నాయి. కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ మే 3తో ముగియనుంది. అయితే ఈ లాక్ డౌన్ ను మరింత పొడిగిస్తారా? లేక షరతులతో ఎత్తేస్తారా అన్న అంశంపై త్వరలోనే క్లారిటీ రానుంది. అయితే ఈ విషయంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో తీరుగా వ్యవహరిస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న కేసుల తీవ్రతతోపాటు ముందు జాగ్రత్త చర్యలుగా పలు రాష్ట్రాలు ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తెలంగాణలో లాక్ డౌన్ ను మే 7 వరకూ తొలగించే ప్రశ్నలేదని..ఎలాంటి మినహాయింపులు కూడా ఉండవని సీఎం కెసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అదే ఏపీలో అయితే కేంద్రం ఇచ్చిన మినహాయింపులతో పాటు కేంద్రం లాక్ డౌన్ ఎప్పుడు తొలగిస్తే అప్పటి నుంచే దాన్ని ఏపీలో కూడా అమలు చేసేందుకు జగన్ సర్కారు సిద్ధంగా ఉంది. ఈ విషయంలో దేశంలోని ఒక్కో రాష్ట్రం ఒక్కో రకంగా నిర్ణయాలు తీసుకుంటోంది. విదేశాల్లో చిక్కుకుపోయిన దేశ పౌరులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో సాధ్యమైనంత త్వరగా తమను స్వదేశానికి తీసుకెళ్లాలని కోరుతున్నారు. దీంతోపాటు ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి భారత్ పై ఒత్తిడి కూడా ఉంది. తమ దేశంలోని భారతీయ కార్మికులను తీసుకెళ్లాల్సిందిగా అవి కోరుతున్నాయి. అయితే భారత్ లో లాక్ డౌన్ సడలింపు..కరోనా కేసుల ఉధృతి తదితర అంశాల ఆధారంగా దీనిపై తుది నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు.

Next Story
Share it