Telugu Gateway
Latest News

ఎయిర్ లైన్స్ కు కేంద్రం షాక్

ఎయిర్ లైన్స్ కు కేంద్రం షాక్
X

దేశంలోని ఎయిర్ లైన్స్ కు పౌరవిమానయాన శాఖ షాక్ ఇచ్చింది. తొలి దశ లాక్ డౌన్..రెండవ దశ లాక్ డౌన్ సమయంలో విమాన టిక్కెట్లు బుక్ చేసుకుని వాటిని రద్దు చేసుకున్న ప్రయాణికులకు మూడు వారాల్లోగా రిఫండ్ చేయాల్సిందేనని కేంద్ర పౌరవిమానయాన శాఖ స్పష్టం చేసింది. ప్రైవేట్ ఎయిర్ లైన్స్ అన్నీ తాము ప్రస్తుతం రిఫండ్ ఇవ్వలేమని..తదుపరి టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో వాటిని సర్దుబాటు చేసుకోవాలని ఇప్పటివరకూ సూచిస్తూ వచ్చాయి. ఓ వైపు రైల్వే శాఖ రిజర్వేషన్లకు సంబంధించిన పూర్తి డబ్బును వాపస్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎయిర్ లైన్స్ రిఫండ్ అంశానికి సంబంధించి ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి కూడా.. దీంతో కేంద్ర పౌరవిమానయాన శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 మ‌ధ్య విమాన టికెట్ల‌ను బుక్ చేసుకున్న‌వారికి మూడు వారాల్లోగా రీఫండ్ డ‌బ్బులు అందించాల్సిందిగా అన్నిఎయిర్‌లైన్స్‌ ని ఆదేశించింది.

ఈ మేర‌కు గురువారం డిప్యూటీ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఎ) ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. బుకింగ్స్ ర‌ద్దుకు క్యాన్స‌లేష‌న్ ఛార్జీలు కూడా ఉండవని అందులో స్పష్టం చేశారు. ఏప్రిల్ 14 నుంచి మే3 మ‌ధ్య‌కాలంలో టికెట్స్ బుక్ చేసుకున్న‌వారికి సైతం ఇదే ప‌ద్ధ‌తి వ‌ర్తిస్తుంద‌ని తెలిపింది. ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ తొలగిస్తారనే ఉద్దేశంతో పలు ఎయిర్ లైన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయటం, ప్రయాణికులు కూడా పెద్ద ఎత్తున టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. కానీ దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు అంత‌కంత‌కూ పెరుగుతూనే ఉండటంతో లాక్ డౌన్ ను మే 3 వరకూ పొడిగించిన విషయం తెలిసిందే. దేశీయ ఎయిర్ లైన్స్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. నిదుల లేమితో వీటి మనుగడ కష్టంగా మారిందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో పౌరవిమానయాన శాఖ జారీ చేసిన తాజా ఆదేశాలు ఎయిర్ లైన్స్ ను మరిన్ని చిక్కుల్లోకి నెట్టడమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Next Story
Share it