Telugu Gateway
Latest News

తొలిసారి ఈనాడులో జీతాలు వాయిదా!?

తొలిసారి ఈనాడులో జీతాలు వాయిదా!?
X

వేతనాల్లో కూడా కోత కూడా తప్పదా?

తెలుగు మీడియా కరోనాతో కకావికలం అవుతోంది. ఇప్పటికే పలు సంస్థలు జీతాల్లో కోతలు పెట్టాయి...ఉద్యోగులను తప్పించాయి. ఇప్పుడు దేశంలోనే టాప్ టెన్ పత్రికల్లో ఒకటైన ఈనాడు చరిత్రలో తొలిసారి వేతనాల చెల్లింపును వాయిదా వేసింది. ప్రతి నెలా ఈనాడులో నెల చివరి రోజునే వేతనాలు వేస్తారు. ఇప్పటివరకూ ఈనాడుకు వేతనాలు ఆపిన చరిత్ర లేదు. కానీ ఈ సారి మాత్రం ఏప్రిల్ నెల వేతనాలు మే 10లోగా చెల్లిస్తామని ఉద్యోగులుకు మౌఖికంగా తెలియజేశారు. ఈ పరిణామం సంస్థలోని ఉద్యోగుల్లో కలకలం రేపుతోంది. ప్రతి నెలా జీతాలు ఠంచనుగా వచ్చే సంస్థలో ఈ పరిస్థితి ఏర్పడటంతో భవిష్యత్ ఎలా ఉండబోతుందో అన్న ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది. దీంతోపాటు ఇప్పటికే ఉన్న ఇంటి రుణాలు, ఇతర కమిట్ మెంట్లు ఎలా అన్న ఆందోళనలో ఉద్యోగులు ఉన్నారు. అయితే వేతనాల చెల్లింపు జాప్యం వరకే పరిమితం అవుతారా. లేక వేతనాల్లో కోత కూడా ఉంటుందా? అన్న టెన్షన్ ఉద్యోగుల్లో ఉంది. అయితే ఇప్పటికే వేతనాల్లో కోతకు కూడా కసరత్తు ప్రారంభం అయిందని..ఇది 15 నుంచి 20 శాతం మేర ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

మరో ప్రధాన పత్రిక ఆంధ్రజ్యోతిలో ఇప్పటికే చాలా మంది ఉద్యోగుల వేతనాల్లో 25 శాతం మేర కోత పెట్టారు. అంతే కాదు..జిల్లా ట్యాట్లాయిడ్స్ లేకపోవటంతో సిబ్బందిని కూడా తప్పించారు. అయితే ఇది తాత్కాలికం అని యాజమాన్యం చెబుతోంది. ఇలా తప్పించిన వారికి కోత విధించిన వారి జీతాల నుంచే 25 శాతం చెల్లిస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. ఒక్క ఈనాడు తప్ప ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలు సండే బుక్ ను తీసేసి..ట్యాబ్లాయిడ్ ఫార్మాట్ లో సండే పుస్తకాన్ని తెస్తున్న సంగతి తెలిసిందే. కరోనా దెబ్బకు గత నెలన్నరగా పత్రికలకు అసలు యాడ్స్ ఉండటం లేదు. ఎంతసేపూ కరోనా వార్తలు కూడా పెద్దగా ఇతర వార్తలు కూడా కన్పించటం లేదు. అందుకే పేజీల్లో కూడా పెద్ద ఎత్తున కోతలు వేశాయి.

లాక్ డౌన్ కాలంలో ఎక్కడైనా నిత్యావసరాల వస్తువుల దగ్గర నుంచి ఏ రేట్లు పెరిగినా గగ్గోలు పెట్టే మీడియా మాత్రం ట్యాబ్లాయిడ్స్ తీసేసి..పేజీల్లో భారీగా కోత పెట్టినా కూడా పత్రిక రేటును మాత్రం తగ్గించలేదని కొంత మంది పాఠకులు వ్యాఖ్యానిస్తున్నారు. సంవత్సరాల తరబడి లాభాల తప్ప..నష్టాలు చవిచూడని సంస్థలు కూడా కేవలం ఒకట్రెండు నెలలు ఆదాయం లేకపోవటంతో వేతనాల్లో కోతలు పెట్టి..ఉద్యోగులను తొలగించటం సరికాదనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఒకసారి లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేస్తే పత్రికల్లో యాడ్స్ గతంతో పోలిస్తే కొంత మేర తగ్గినా అగ్రశ్రేణి పత్రికలకు పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవని..అయినా సరే ఉద్యోగులు..వేతనాల్లో కోతలు కోయటం సరికాదనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Next Story
Share it