Telugu Gateway
Latest News

రియల్ ఎస్టేట్ కు కరోనా షాక్..ధరలు 20 శాతం తగ్గుతాయి!

రియల్ ఎస్టేట్ కు కరోనా షాక్..ధరలు 20 శాతం తగ్గుతాయి!
X

కరోనా కొట్టిన దెబ్బ ఏ రంగాన్ని వదల్లేదు. విమానయాన రంగం..ఆటోమొబైల్, వినోద రంగం, పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ ఇలా ఒకటేమిటి అన్నీ కరోనా కల్లోలంలో విలవిలలాడుతున్నాయి. ఇది ఒకెత్తు అయితే ఈ సంక్షోభం నుంచి ఎవరు ఎప్పుడు బయటపడతారు అన్న క్లారిటీ ప్రస్తుతానికి అయితే ఎవరి దగ్గరా లేదు. 21 రోజుల లాక్ డౌన్ తో దేశ ఆర్ధిక వ్యవస్థ ఇప్పటికే కుదైలైపోయింది. ఇప్పుడు కొత్తగా మరో 19 రోజుల లాక్ డౌన్ ప్రకటించారు ప్రధాని నరేంద్రమోడీ. మరి ఈ ప్రభావం రాబోయే రోజుల్లో మరింత తీవ్రంగా ఉండే అవకాశం కన్పిస్తోంది. కరోనా కారణంగా రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ ధరలు 20 శాతం మేర తగ్గే అవకాశం ఉందనే అంచనాలు వెల్లడవుతున్నాయి. వాణిజ్య అవసరాల స్పేస్ డిమాండ్ కూడా గతంలో ఎన్నడూలేని రీతిలో తగ్గుముఖం పడుతుందని నివేదికలు వెల్లడయ్యాయి. రియల్ ఎస్టేట్ ధరలు 20 శాతం మేర తగ్గుతాయని సాక్ష్యాత్తూ హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (హెచ్ డీఎఫ్ సీ) చీఫ్‌ దీపక్‌ పరేఖ్‌ పేర్కొన్నారు.

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ధరలు దిగివస్తాయని జాతీయ రియల్‌ఎస్టేట్‌ అభివృద్ధి మండలి (నరెడ్కో), రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లతో ఏర్పాటు చేసిన వెబినార్‌లో పాల్గొన్న సందర్భంగా పరేఖ్‌ ఈ వ్యాఖ‍్యలు చేశారు. కోవిడ్‌-19 ప్రభావంతో రియల్‌ ఎస్టేట్‌ ధరలు 10 నుంచి 15 శాతం తగ్గుతాయని నరెడ్కో అంచనా వేస్తుండగా పరేఖ్ మాత్రం 20 శాతం ధరలు పడిపోతాయనే అంచనాతో సిద్ధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగ భద్రత కలిగి నగదు ప్రవాహం బాగా ఉన్న వారు ఇళ్లు కొనుగోలు చేసేందుకు ఇది సరైన సమయమని పరేఖ్‌ అభిప్రాయపడ్డారు. రియల్‌ ఎస్టేట్‌ అత్యుత్తమమైన ఆస్తి అని, అంతర్జాతీయంగా నిర్మాణ రంగ విలువ అన్ని షేర్లు, బాండ్లు కలిపిన విలువ కంటే అత్యధికమని చెప్పారు. అందుబాటు గృహాల కొనుగోళ్లకు ప్రభుత్వం పలు రాయితీలు ప్రకటించినా ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా పెను విపత్తు చోటుచేసుకుందని ఆందోళన వ్యక్తం చేశారు.

మారటోరియంను ఆఖరి అవకాశంగా వాడుకోవాలని డెవలపర్లకు ఆయన సూచించారు. నిధుల సమీకరణకు రుణాల కంటే ఈక్విటీ వైపు మొగ్గుచూపాలని కోరారు. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే ముందు ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులను పూర్తిచేయడంపై డెవలపర్లు దృష్టిసారించాలని సూచించారు. ‘ఇంటికి తక్కువ డబ్బు తీసుకువెళ్లండి..కంపెనీలోనే అధిక సొమ్ము ఉండేలా చూస్తూ ఖర్చులను నియంత్రించా’లని డెవలపర్లను పరేఖ్ కోరారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగంపై రకరకాల కారణాల వల్ల ఒత్తిడి తీవ్రంగా ఉందన్నారు. నిర్మాణ రంగ ఫైనాన్స్ విభాగంలో నిరర్ధక ఆస్తులు పెరగటం, లిక్విడిటి కొరత వంటి సమస్యలు ఇప్పటికే రియల్ రంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయని వెల్లడించారు. కరోనా ప్రభావం కారణంగా ఈ ఏడాది అంతా గృహ నిర్మాణ విభాగంపై ప్రతి కూల ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.

Next Story
Share it