Telugu Gateway
Latest News

ఆర్ బిఐ కీలక నిర్ణయాలు

ఆర్ బిఐ కీలక నిర్ణయాలు
X

కరోనా దేశ ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) రంగంలోకి దిగింది. దేశంలో నగదు లభ్యతను పెంచేందుకు వీలుగా కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రివర్స్ రేపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో రివర్స్ రెపో రేటు 4 శాతం నుంచి 3.75 శాతానికి తగ్గింది. ఆర్ బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ శుక్రవారం నాడు విలేకరుల సమావేశంలో పలు కీలక అంశాలను ప్రకటించారు. రెపో రేటులో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. లాక్ డౌన్ తో తీవ్ర ఆర్ధిక సంక్షోభాల్లో చిక్కుకుపోయిన రాష్ట్రాలను ఆదుకునేందుకు వీలుగా అత్యంత కీలకమైన వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ (డబ్ల్యుఎంఎ) అరవై శాతం మేర పెంచారు. సెప్టెంబర్ 30 వరకూ ఈ పెంపు అమల్లో ఉండనుంది. దీని వల్ల రాష్ట్రాలకు వెసులుబాటు లభించి..అత్యవసర సమయాల్లో నగదు సర్దుబాటు చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇవి కాకుండా ఆర్ బిఐ పలు చర్యలు ప్రకటించింది. జాతీయ హౌసింగ్ బోర్డుకు పది వేల కోట్ల రూపాయాలు, నాబార్డుకు 25 వేల కోట్ల రూపాయలు, చిన్న తరహా పరిశ్రమలకు 50 వేల కోట్లు ప్రకటించారు.

దీంతోపాటు మారటోరియం సమయంలో 90 రోజుల ఎన్ పీఏ గడవు వర్తించదని ఆర్ బిఐ స్పష్టం చేసింది. కరోనా సంక్షోభ సమయంలోనూ బ్యాంకులు ఎంతో మెరుగైన సేవలు అందిస్తున్నాయని తెలిపారు. ప్రపంచ మార్కెట్లు అన్నీ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్నాయన్నారు. ఆర్ బిఐ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. 2011-22 ఆర్ధిక సంవత్సరానికి దేశ వృద్ధి రేటు 7.4 శాతంగా ఉంటుందని ఆర్ బిఐ అంచనా వేసింది. లాక్ డౌన్ తర్వాత 1.20 లక్షల కోట్లు విడుదల చేశామని తెలిపారు. ఏటీఎంలు సమర్ధవంతంగా పని చేస్తున్నాయని ఆర్ బిఐ గవర్నర్ తెలిపారు. 1930 తరువాత ఇంతటి సంక్షోభాన్ని చూడలేదనీ, అయినా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామన్నారు.

Next Story
Share it