Telugu Gateway
Latest News

మే 3 వరకూ దేశమంతటా లాక్ డౌన్

మే 3 వరకూ దేశమంతటా లాక్ డౌన్
X

ప్రదాని నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేశారు. దేశమంతటా మే 3 వరకూ లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కొత్తగా 19 రోజుల లాక్ డౌన్ పొడిగించినట్లు అయింది. ఇప్పటికే దేశం 21 రోజుల లాక్ డౌన్ ను దేశం పూర్తి చేసుకుంది. మంగళవారం ఉదయం పది గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించిన సమయంలో మోడీ ఈ కీలక ప్రకటన చేశారు. ఇప్పడు ఉన్న పరిస్థితుల్లో లాక్ డౌన్ తొలగించటం ఏ మాత్రం సరికాదన్నారు. ‘లాక్ డౌన్ సందర్భంగా మీకు ఎన్నో కష్టాలు వచ్చాయి. చాలా మందికి తినటానికి తిండి దొరకలేదు. ఒక చోట నుంచి మరో చోటుకు పోవటానికి లేదు. రావటానికి లేదు. కానీ మీరందరూ ఎంతో చక్కగా మీ కర్తవ్యాన్ని నిర్వహించారు. మీ అందరికి ప్రణామాలు. అయినా సరే కష్టాన్ని ఎదుర్కొన్ని దేశాన్ని రక్షించారు. ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ కు నిజమైన శ్రద్ధాంజలి. కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది. కరోనాపై పోరుకు ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. కరోనాపై భారత్ బలంగా పోరాడుతోంది. సైనికుల్లా ప్రజలు ఇందులో పాల్గొంటున్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను ఖచ్చితంగా 14 రోజులు తప్పనిసరిగా క్వారంటైన్ లో పెట్టాం.

కరోనా వ్యాప్తి చెందకుండా ఎన్నో చర్యలు చేపట్టాం. మాల్స్, థియేటర్ల అన్నీ బంద్ చేశాం. 21 రోజుల లాక్ డౌన్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. కరోనా మహమ్మారిగా మారకముందే దేశంలో చర్యలు ప్రారంభించాం. ఎంతో సమర్ధవంతంగా, అందరినీ సమన్వపరిచి చర్యలు చేపట్టాం. లేకపోతే భారత్ పరిస్థితి ఊహించలేని స్థితిలో ఉండేది. ఆర్ధిక రంగ పరంగా చూస్తే ఇది ఎంతో పెద్ద దెబ్బే. అయినా సరే ప్రజలను దృష్టిలో పెట్టుకుని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. లాక్ డౌన్, సోషల్ డిస్టన్సింగ్ ద్వారా ఎంతో మెరుగ్గా ఉన్నాం. ఇతర దేశాలతో పోలిస్తే మన పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంది. చాలా రాష్ట్రాలు ఇఫ్పటికే లాక్ డౌన్ పొడిగించాయి. సీఎంలు అందరూ పొడిగించాలనే కోరారు.ఏప్రిల్ 20 తర్వాత పరిస్థితిని సమీక్షించి కీలక రంగాలకు మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంది.

ఇక నుంచి కరోనా హాట్ స్పాట్స్ పై అధిక దృష్టి పెట్టనున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. దీంతోపాటు లాక్ డౌన్ కు సంబంధించి మార్గదర్శకాలను బుధవారం నాడు సవివరంగా జారీ చేయనున్నట్లు తెలిపారు. పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఆంక్షల సడలింపుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మే 3 వరకూ ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలని ప్రధాని నరేంద్రమోడీ కోరారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ దఫా కూడా లాక్ డౌన్ ను మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు వెల్లడించారు. అందరూ మాస్క్ లు ధరించాలని..సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని కోరారు. రెడ్ జోన్లతోపాటు అన్ని జోన్లలోనూ లాక్ డౌన్ అమలు అవుతుందని..ఎక్కడైనా మినహాయింపులు ఇస్తే సమస్య మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ విషయంలో వైద్య శాఖ అధికారులు చేసిన సూచనను మోడీ పరిగణనలోకి తీసుకున్నారు.ఉద్యోగులను విధుల నుంచి తప్పించవద్దని ప్రదాని మోడీ కోరారు. అదే సమయంలో కరోనాపై పోరులో ఉన్న డాక్టర్లు, పోలీసులు, ఇతర సిబ్బందిని గౌరవించాలని కోరారు.

Next Story
Share it