Telugu Gateway
Latest News

కరోనా ఎఫెక్ట్...విమాన ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు!

కరోనా ఎఫెక్ట్...విమాన ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు!
X

దేశీయ విమాన ప్రయాణికులకు లాక్ డౌన్ తర్వాత కూడా తిప్పలు తప్పేలా లేవు. ఎందుకంటే కరోనా వైరస్ పూర్తిగా దేశం నుంచి పోవటానికి చాలా సమయం పట్టే అవకాశం కన్పిస్తోంది. అందుకే ప్రధాని నరేంద్రమోడీ కూడా ఇది ‘సుదీర్ఘపోరాటం’ అని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. విమాన ప్రయాణికులను మరింత సురక్షితంగా తమ తమ గమ్యాలను చేర్చేందుకు సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) కొత్త నిబంధనలు సిద్ధం చేసింది. అవేంటి అంటే విమాన ప్రయాణికులు తమ విమానం బయలుదేరే సమయానికి రెండు గంటలు ముందే విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంటుంది.అదే సమయంలో ప్రయాణికులు అందరూ రక్షిత ఉత్పత్తులు అయిన మాస్క్ లు, గ్గోవ్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనలను సీఐఎస్ఎప్ కేంద్ర పౌరవిమానయానశాఖ కు అందజేసింది. ఈ విషయాన్ని సంస్థ స్పెషల్ డైరక్టర్ (ఎయిర్ పోర్ట్ట్స్) జీ ఏ గణపతి ఓ న్యూస్ ఏజెన్సీకి తెలిపారు.

వాస్తవానికి ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం రెండు గంటల ముందు కేవలం అంతర్జాతీయ ప్రయాణికులు మాత్రమే విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు దీన్ని దేశీయ ప్రయాణికులకు వర్తింపచేయనున్నారు. ఇప్పటికే దేశీయ విమానయాన రంగం కరోనా కారణంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. వాస్తవానికి చాలా మంది ఏప్రిల్ 15 నుంచి దేశీయ సర్వీసులకు అనుమతిస్తారని భావించినా ఇప్పుడు ఆ పరిస్థితులు కన్పించటంలేదు. దేశంలోని పలు రాష్ట్రాలు ఇఫ్పటికే ఏప్రిల్ నెలాఖరు వరకూ లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేంద్రం మాత్రం దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ప్రధాని నరేంద్రమోడీ త్వరలో చేయనున్న ప్రకటనలో విమానయాన రంగంతోపాటు ఏయే పరిశ్రమలకు..ఏయే వర్గాలకు ఊరట కల్పిస్తారనే అంశంపై ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

Next Story
Share it