Telugu Gateway
Latest News

లాక్ డౌన్ కొనసాగిస్తే ఆకలి మరణాలే ఎక్కువవుతాయి

లాక్ డౌన్ కొనసాగిస్తే ఆకలి మరణాలే ఎక్కువవుతాయి
X

లాక్ డౌన్ పై కేంద్రం వైఖరి ఏంటో ప్రస్తుతానికి తేలలేదు. కానీ పలు రాష్ట్రాలు ఎవరి నిర్ణయాలు వారు తీసుకుంటున్నారు. ఈ తరుణంలో పారిశ్రామికవేత్తలు లాక్ డౌన్ పై గళం విప్పుతున్నారు. ఇటీవలే మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా లాక్ డౌన్ స్పందించారు. పాక్షిక మినహాయింపులు వల్ల పరిశ్రమకు ఎలాంటి ప్రయోజనాలు ఉండవన్నారు. ఇంత సుదీర్ఘకాలం తర్వాత లాక్ డౌన్ ను తొలగించటమే ఉత్తమం అని పేర్కొన్నారు. తాజాగా ప్రముఖ ఐటి సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి కూడా లాక్ డౌన్ పై స్పందించారు. లాక్‌డౌన్‌ ఇంకా పొడిగిస్తే కరోనా కంటే ఆకలితోనే ఎక్కువ మంది చనిపోయే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా ఎక్కువ కాలం కొనసాగితే అసంఘటిత రంగంలోని కార్మికులు చాలామంది తమ ఉద్యోగాలను కోల్పోతారన్నారు. అనేక అభివృద్ధి చెందిన దేశాల కంటే భారతదేశ మరణాల రేటు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, లాక్‌డౌన్‌ ఆంక్షలను ఎక్కువ కాలం కొనసాగించే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో సంక్రమణకు గురయ్యే వారిని జాగ్రత్తగా చూసుకుంటూ, సామర్థ్యం ఉన్నవారికి తిరిగి పనిని ప్రారంభించే వీలు కల్పించాలని ఆయన అన్నారు.

లేదంటే ఆకలి కారణంగా సంభవించే మరణాలు కరోనా వైరస్ మరణాలను మించిపోతాయన్నారు. లాక్‌డౌన్‌ ప్రభావం గురించి మూర్తి మాట్లాడుతూ, చాలా సంస్థలు తమ ఆదాయంలో 15-20 శాతం కోల్పోయారన్నారు. ఇది ఆదాయపు వస్తువు సేవల పన్ను (జిఎస్టి) వసూళ్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు. ఇండియా లాంటి దేశాలు లాక్‌డౌన్‌ను కొనసాగించే పరిస్థితులు లేవు. మరింత కాలం ఈ పరిస్థితి కొనసాగితే కరోనా చావుల కంటే ఆకలి చావులే ఎక్కువయ్యే ప్రమాదముందన్నారు. అసంఘటిత రంగం, స్వయం ఉపాధి పొందుతున్న వారు సుమారు 20 కోట్లమంది ఉన్నారని, లాక్‌డౌన్ పొడిగిస్తే వీరంతా మరింత సంక్షోభంలోకి కూరుకు పోతారని ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story
Share it