Telugu Gateway
Latest News

లాక్ డౌన్ నుంచి మరిన్ని మినహాయింపులు

లాక్ డౌన్ నుంచి మరిన్ని మినహాయింపులు
X

ఎలక్ట్రిక్ షాప్ లు.స్టేషనరీ షాప్ లకు మినహాయింపు

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏప్రిల్ 20 నుంచి కేంద్రం లాక్ డౌన్ కు సంబంధించి పలు మినహాయింపులు ఇచ్చింది. గ్రామీణ పరిశ్రమలతోపాటు రెడ్ జోన్లు కాని ప్రాంతాల్లో పరిమిత సంఖ్యలో కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తెలంగాణతోపాటు ఢిల్లీ వంటి రాష్ట్రాలు మాత్రం తాము ఎలాంటి మినహాయింపులు ఇవ్వబోమని..ఇప్పట్లో లాక్ డౌన్ ఎత్తేస్తే సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రకటించాయి. ఈ తరుణంలో కేంద్రం మరికొన్ని మినహాయింపులు ఇచ్చింది. అయితే ఇవి తెలంగాణలో అమలు అవటం కష్టమే అన్న అభిప్రాయం ఉంది. ఎందుకంటే తెలంగాణ సీఎం కెసీఆర్ రాష్ట్రంలో లాక్ డౌన్ ను మే 7 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా అర్బన్‌ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్‌ దుకాణాలు, స్టేషనరీ షాపులకు మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీవాస్తవ తెలిపారు. మిల్క్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, మొబైల్‌ రీఛార్జి దుకాణాలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు పనిచేస్తాయని తెలిపారు. రహదారి నిర్మాణ పనులు, సిమెంట్‌ యూనిట్లకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

హాట్‌స్పాట్‌ కేంద్రాలకు ఇవి వర్తించబోవన్నారు. ఈ మేరకు వివిధ శాఖల సంయుక్త మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1409 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వివరించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 21,393కి చేరిందని చెప్పారు. గడిచిన 28 రోజులుగా దేశవ్యాప్తంగా 12 జిల్లాల్లో కొత్తగా ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని, గడిచిన 14 రోజులుగా 78 జిల్లాల్లో పాజిటివ్‌ కేసు రాలేదని చెప్పారు. ఇప్పటి వరకు 4,257 మంది కోలుకోగా.. ఒక్క రోజులోనే 388 మంది కోలుకున్నారని తెలిపారు. మొత్తం కేసుల్లో ఇది 19.89 శాతమని లవ్‌ అగర్వాల్‌ వివరించారు.

Next Story
Share it