ఎమ్మెల్యేల వేతనాల్లో 30 శాతం మేర కోత

మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా దెబ్బకు అతలాకుతలం అవుతున్న మహారాష్ట్రలో ఎమ్మెల్యే వేతనాల్లో కోత విధించాలని నిర్ణయించారు. ఈ కోత ఏడాది పాటు 30 శాతం మేర ఉండనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఎంపీల వేతనాల్లో 30 శాతం మేర కోత విధించిన విషయం తెలిసిందే. గురువారం నాడు జరిగిన మహారాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ర్ట ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణ కోసం ఏర్పాటైన రెండు కమిటీలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ కమిటీల్లో మాజీ అధికారులు, మహారాష్ట్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు సహా, డిప్యూటీ సీఎం అజిత్ పవార్, జయంత్ పాటిల్ ఉన్నారు. దేశంలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న మహారాష్ర్టలో 24 గంటల్లోనే 72 మంది ప్రాణాలు కోల్పోగా, మొత్తం కేసుల సంఖ్య 1,135కు చేరింది. కరోనా కారణంగా మహారాష్ట్రలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే ఏ సభలోనూ సభ్యుడు కాని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ఆరు నెలల సమయం ముంచుకొస్తోంది. ఈ తరుణంలో ఆయన్ను మండలికి నామినేట్ చేయాలని మంత్రివర్గం గవర్నర్ ను కోరింది.