Telugu Gateway
Latest News

మహారాష్ట్రలో రెండు వేలు దాటిన కరోనా కేసులు

మహారాష్ట్రలో రెండు వేలు దాటిన కరోనా కేసులు
X

దేశ ఆర్ధిక రాజధాని ముంబయ్ నగరం ఉన్న మహారాష్ట్ర కరోనా కేసులతో దేశాన్నే వణికిస్తోంది. ఎందుకంటే ఏప్రిల్ 13.. సోమవారం నాటికి రాష్ట్రంలో కేసుల సంఖ్య ఏకంగా రెండు వేలు దాటింది. దేశంలో ఇంత భారీ స్థాయిలో కేసులు ఉన్న ఏకైక రాష్ట్రం కూడా ఇదే కావటం గమనార్హం. సోమవారం నాటికి మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 2064కు చేరింది. సోమవారం నాడు మహారాష్ట్రలో మొత్తం 82 కొత్త కరోనా పాజిటివ్ కేసులురాగా..అందులో 59 కేసులు ఒక్క ముంబయ్ నగరంలోనే ఉన్నాయి. దేశంలోనే అత్యధిక మరణాలు కూడా మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఇప్పటి వరకూ మహారాష్ట్రలో 149 మంది మరణించారు.

ఏప్రిల్ 7న తొలుత మహారాష్ట్రలో కేసుల సంఖ్య 1000 దాటింది. ఏప్రిల్ 13 నాటికే మొత్తం కేసులు ఏకంగా 2064కు చేరాయంటే రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. లాక్ డౌన్ ఉన్నప్పటికి మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 217 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకూ 9352 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Next Story
Share it